Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల టీమ్ - 4 రోజులపాటు పరిశీలన
AP News Latest: అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. నేటి (జూన్ 30) నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభించారు.
Polavaram Project Construction: పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి? పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. 4 రోజుల పర్యటనలో భాగాంగా కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించిన అనంతరం, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు.
పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో నిపుణులు బృందం సమావేశం అయ్యారు. అనంతరం రాత్రి రాజమండ్రికి చేరుకున్న నిపుణులు, పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్ట్ సైట్‌ను పరిశీలిస్తున్నారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం (జూన్ 29) ఢిల్లీకి చేరుకున్నారు. నేటి (జూన్ 30) నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభించారు.
నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు అక్కడే ఉంటారు. మొదటి రెండ్రోజుల పాటు ప్రాజెక్టును పూర్తిగా పరిశీలిస్తారు. ప్రతి కట్టడాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా పర్యటన షెడ్యూల్ సిద్ధమైంది. ఆ తర్వాత మరో రెండ్రోజుల పాటు సమస్యలను పరిష్కారాలపై మేధోమథనం చేయనున్నారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్ సంస్థ ప్రతినిధులు, వ్యాప్కోస్, బావర్, కెల్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రి ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణుల బృందం చర్చించనున్నారు.
అంతర్జాతీయ స్థాయి నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అవసరమని కేంద్ర జలసంఘం నిర్ణయించిన క్రమంలో ఈ అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ అఫ్రి సాయం తీసుకుంటున్నారు. వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్, కెనడాకు చెందిన రిచర్డ్ డోన్నెల్లీలు నియమితులయ్యారు. పోలవరం ప్రాజెక్టులో సవాళ్లకు సంబంధించిన కీలక అంశాల్లో వీరంతా నిపుణులు. అంతర్జాతీయ డ్యాం భద్రత నైపుణ్యం, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ సొల్యూషన్స్, సివిల్ ఇంజినీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, జియో టెక్నికల్ ఇంజినీరింగ్ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండటంతో వీరిని ఎంచుకున్నట్లు కేంద్ర జలసంఘం పేర్కొంటోంది.