Ayyanna : అరెస్ట్ చేసి వదిలి పెట్టిన కేసులో అయ్యన్నకు ఊరట - హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?
అయ్యన్న పాత్రుడిపై నమోదైన కేసులో పోలీసులు నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. 41 ఏ నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది.
Ayyanna : టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు అర్నేష్ కుమార్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు వద్దని 41ఏ నిబంధనలు ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆర్నేషన్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో తీర్పు ఇచ్చింది.
ఐదు రోజుల కిందట విశాఖ ఎయిర్ పోర్టులో అయ్యన్ను అరెస్ట్ చేసిన పోలీసులు
గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించారని మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు గురించి ఎలాంటి నోటీసులు, చర్యలు తీసుకోని పోలీసులు హఠాత్తుగా ఐదు రోజుల కిందట ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చిన అయ్యన్నను ఎయిర్‌పోర్టులోనే కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ తరలిస్తూ దారి మధ్యలో 41ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారు.
మార్గమధ్యంలో 41 ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేసిన పోలీసులు
ఈ నెల 14న విచారణకు రావాలని అయ్యన్నకు పోలీసుల నోటీసులు ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మంత్రులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 41 ఏ కింద నోటీసు ఇచ్చారు. మొదట అరెస్ట్ చేయండి.. ఆ తర్వాత మధ్యలో వదిలేయడం.. 41 A నోటీసులు ఇవ్వడం.. ఇలా అనుమానాస్పదంగా పోలీసుల తీరు ఉందని టీడీరీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసే తీసుకెళ్తున్న సమయంలో మార్గం పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందని .. 10 నిముషాల తర్వాత తన దగ్గరకు వచ్చిన పోలీసులు విడిచి పెడుతున్నట్టు చెప్పారని అప్పుడే అయ్యన్న చెప్పారు. 41 (ఎ) నోటీసులు ఇచ్చి 10 రోజుల్లో హనుమాన్ జంక్షన్ వచ్చి హాజరవ్వమన్నారని ఈ నెల 4న పుట్టిన రోజు ఉంది ఆ తర్వాత వస్తానని చెప్పానన్నారు. తాను గన్నవరం సభలో ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. జరుగుతున్న విషయాలే చెప్పానన్నారు అయ్యన్నపాత్రుడు.
కుట్ర ప్రకారం ఇసలాంటి పనులు చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ
అయ్యన్న పాత్రుడికి 41 ఏ నోటీసు ఇవ్వడానికే పోలీసులు వచ్చి ఉంటే.. కిడ్నాప్ తరహాలో ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకెళ్లాల్సిన, నిర్భందించాల్సిన అవసరం ఏముంది..? ప్రభుత్వంపై అయ్యన్న విమర్శలే నేరమైతే.. మంత్రులు, వైసీపీ నేతలు రోజూ చేస్తున్న వ్యాఖ్యలకు, విద్వేష ప్రసంగాలకు జీవితాతం జైల్లో పెట్టాలని చంద్రబాబు మండిపడ్డారు. తర్వాత అయ్యన్న పాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు.