Chintamani Play: చింతామణి నాటక నిషేధంపై హైకోర్టులో పిల్... ఒక పాత్ర కారణంగా నిషేధం సరికాదన్న ఎంపీ రఘురామ
చింతామణి నాటక ప్రదర్శన నిషేధంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ప్రభుత్వం అనాలోచితంగా నాటకంపై నిషేధం విధించిందని ఆ జీవోను రద్దు చేయాలని కోరారు.
చింతామణి నాటక ప్రదర్శనను ఏపీ ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధంపై కళాకారుల నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ వివాదం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7ను సవాల్ చేస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోర్టును కోరారు. అప్పటి సమాజంలో వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రాశారని తెలిపారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న నాటకంపై నిషేధం విధించడం సరికాదన్నారు. ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వేల మంది కళాకారులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తే కళాకారులు రోడ్డున పడతారన్నారు. నాటకంలోని ఒక పాత్ర కారణంగా మొత్తం నాటక ప్రదర్శనపై నిషేధం విధించడం సరికాదన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జీవో 7ను రద్దు చేయాలని ఎంపీ రఘురామ కోర్టును కోరారు.
రోశయ్యే నాటకాన్ని రద్దు చేయలేదు
చింతామణి నాటకాన్ని రద్దు చేసి వైసీపీ ప్రభుత్వం కళాకారుల పొట్టకొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కళాకారులు. రాష్ట్రవ్యాప్తంగా చింతామణి నాటకాన్ని నమ్ముకుని దాదాపు 30 వేల మంది కళాకారులున్నారని, నెల్లూరు జిల్లాలోనే మొత్తం 3 వేల మంది కళాకారులు చింతామణి నాటకంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణ, ఒడిశా, కేరళ, కర్నాటకలో కూడా చింతామణి నాటకం బాగా ఫేమస్ అని అన్నారు. చింతామణి నాటకాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. చింతామణి నాటకంలోని పాత్రధారుల వేషాల్లో నిరసనలో పాల్గొన్నారు. 40 ఏళ్ల నుంచి చింతామణి నాటకంపై విమర్శలు వస్తున్నా.. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులెవరూ నాటకాన్ని రద్దు చేసే సాహయం చేయలేదని, అదే సామాజిక వర్గం నుంచి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి రోశయ్య కూడా చింతామణి నాటకాన్ని రద్దు చేయాలనుకోలేదని, జగన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. నాటకం రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు నిరసనలు తెలియజేస్తామన్నారు.
వందేళ్ల చరిత్ర గల నాటకం
ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం చింతామణి. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. ఇది వేశ్య వృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకంపై నిషేధంతో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర వైశ్యులను అవమానించేదిగా ఉందని తక్షణం ఆ నాటకాన్ని నిషేధించాలని కొంత కాలంగా ఆర్యవైశ్య సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేస్తూ వస్తున్నారు. చింతామణి నాటకం ఇప్పటిది కాదు. 1920 ప్రాంతంలో కాళ్లకూరి నారాయణరావు రాశారు. ఆనాటి సాంఘిక దురాచారాలను, తప్పుడు సంప్రదాయాలను సంస్కరించేందుకు ఈ నాటకాన్ని అప్పటి పరిస్థితులను బట్టి రాశారు. నాటకాలే ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న రోజుల్లో ఈ చింతామణి నాటకానికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో తన వంతు పాత్ర పోషించింది.
Also Read: చింతామణి నాటకంపై నిషేధం... తర్వాత కన్యాశుల్కం పైనా ! సంఘ సంస్కర్తలకు లభించే విలువ అంతేనా ?