Mithun Reddy: లిక్కర్ స్కాంలో నెక్ట్స్ అరెస్టు మిథున్ రెడ్డిదేనా ? - ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు
AP High Court: మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. సీఐడీ ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది.

Andhra Liquor Scam: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఇలాంటి సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది ఈ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడం ద్వారా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. సీఐడీ తరపు లాయర్లు వాదించారు.
మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణంలో "ప్రధాన వ్యూహకర్త , అమలు పరిచిన వ్యక్తిగా"గా సీఐడీ సిట్ చెబుతోంది. ఆయన మద్యం విధానం రూపొందించడంలో, దానిని అమలు చేయడంలో, లంచాలు చెల్లించిన కంపెనీలకు మాత్రమే ఆర్డ ర్‌లు ఇవ్వడం జరిగేలా చూడడంలో కీలక పాత్ర పోషించారని ఆరోపించింది. మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డికార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ16) నుండి 5 కోట్లు బదిలీ చేశారు. కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత తిరిగి డికార్ట్ లాజిస్టిక్స్‌కు ఈ నిధులు బదిలీ చేశారు. అవి వివిధ రూపాల్లో మిథున్ రెడ్డికి తిరిగి చేరాయని సీఐడీ కోర్టుకు చెప్పింది.
ఆర్థిక లావాదేవీలు షెల్ కంపెనీల ద్వారా జరిగాయని, మద్యం కంపెనీల నుండి లంచాలు సేకరించి, వాటిని హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా లాండరింగ్ చేశారని సీఐడీ తెలిపింది. మిథున్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేస్తూ, మద్యం విధానాన్ని నియంత్రించడంలో పాలుపంచుకున్నారని సీఐడీ ఆరోపించింది. ఆటోమేషన్ వ్యవస్థను తొలగించి, మాన్యువల్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టడం ద్వారా లంచాలు చెల్లించిన డిస్టిలరీలకు ఆర్డర్‌లు ఇవ్వడం సులభతరం చేశారని సీఐడీ వాదిస్తోంది. ఈ విధానం ద్వారా ప్రముఖ భారతీయ మద్యం బ్రాండ్‌లను మార్కెట్ నుండి తొలగించి, లంచాలు చెల్లించిన కొన్ని "బ్లూ-ఐడ్ బ్రాండ్‌ల"కు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని సిట్ రిపోర్టు పేర్కొంది.
2019 అక్టోబర్‌లో విజయసాయి రెడ్డి ఇంటిలో జరిగిన సమావేశంలో మిథున్ రెడ్డి, కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, సత్యప్రసాద్ మరియు ఇతరులు పాల్గొన్నట్లు సీఐడీ ఆరోపించింది. ఈ సమావేశంలో లంచాల సేకరణ, ఆర్డర్‌ల జారీ, నిధుల బదిలీ విధానాలను చర్చించినట్లు తెలిపింది. మిథున్ రెడ్డి కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారా మరిన్ని ఆర్థిక లావాదేవీలను మరియు ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న ఇతర లబ్ధిదారులను గుర్తించవచ్చని సీఐడీ చెబుతోంది. గతంలో అరెస్టు చేయకుండా మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. అయితే హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ తిరస్కరిస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కారణంగా ఆయనను ఏ క్షణమైనా సీఐడీ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.
మిథున్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. రాజంపేట నుంచి వరుసగా మూడో సారి విజయం సాధించారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో ఆయన ఇరుక్కున్నారు.





















