(Source: ECI/ABP News/ABP Majha)
Tirupati Gangamma Jatara : తిరుపతి గంగమ్మ జాతరకు రాష్ట్ర పండుగ హోదా, ఇకపై అధికారికంగా నిర్వహణ
Tirupati Gangamma Jatara : తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది ప్రభుత్వం. ఇక నుంచి అధికారికంగా జాతరను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Tirupati Gangamma Jatara : తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై గంగమ్మ జాతరను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు గత ఏడాది సీఎం జగన్ గంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారు. దీనిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో గంగమ్మ జాతర అత్యంత వైభవం జరుపనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
తాతయ్య గుంట గంగమ్మ జాతర
తిరుపతిలో వారం రోజులపాటు తాతయ్యగుంట గంగమ్మ జాతర నిర్వహిస్తుంటారు. ఈ వారం రోజులు పాటు వివిధ వేషధారణలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ జాతర జరిగినన్ని రోజులు అమ్మ వారిని భక్తులు తిట్లు తిడుతుంటారు, అలా తిట్టడం అంటేనే అమ్మవారికి ఇష్టమని స్థానికులకు చెబుతుంటారు. వారం రోజుల్లో రోజుకో వేషం వేస్తూ అమ్మ వారిని కొలవడం అనవాయితీ. ఈ వారం రోజులు తలపై వేయికళ్ల దుత్తలు పెట్టుకుని, శరీరానికి వేపాకును వస్త్రాలుగా ధరించి పోర్లు దండాలు పెడుతూ, వివిధ వేషధారణలతో అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మను భక్తులు దర్శించుకుంటారు. అలా చేస్తే కొలిచిన వారికి అమ్మవారు వరాలనిస్తుందని భక్తుల నమ్మకం. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారలమ్మ జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర గంగమ్మ తల్లి జాతర. అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి. గంగమ్మకు వారం రోజులపాటు అత్యంత వైభవంగా జాతర నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.
శ్రీవారి నుంచి గంగమ్మకు సారె
గంగమ్మ తల్లి జాతరను తెలంగాణ రాష్ట్ర పండుగగా చెప్పుకునే బోనాలు, బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ జాతరలతో పోలుస్తుంటారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వారం రోజుల పాటు జరిగే జాతరలో నాలుగో రోజున గంగమ్మ అన్నయ్య అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్ద నుంచి గంగమ్మకు సారె తీసుకురావడం అనవాయితీ. గంగమ్మ జాతర నాలుగో రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమ పట్టువస్త్రాలు గంప, చేట, మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందిస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారని ప్రతీతి. ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులు కూడా లేకపోలేదు. ఇంత ప్రాముఖ్యత కలిగిన గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగా గుర్తించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.