AP PRC Issue: ఉద్యమంలోకి ఏ రాజకీయపార్టీని అనుమతించం... ఉద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వంతో చర్చలు... పీఆర్సీ సాధన సమితి
పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇస్తామన్నారు. ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీని అనుమతించమని తెలిపారు.
పీఆర్సీ జీవోలపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మరోసారి భేటీ అయ్యాయి. ప్రభుత్వంతో సంప్రదింపులు చేసే విషయంపై చర్చించారు. అనంతరం సీఎస్ ను కలిసి వినతిపత్రం అందించారు. పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.
Also Read: సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?
సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు
ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. అశుతోష్ కమిటీ రిపోర్టును బయటపెట్టాలన్నారు. ఉద్యోగులకు మేలు జరిగేలా పీఆర్సీ ఖరారు చేసేలా ప్రభుత్వం తిరిగి చర్చలు జరపాలన్నారు. కొత్త పీఆర్సీ జీవోల్లో గ్రామ వార్డు సచివాలయాలకు పాత జీతాలను మెన్షన్ చేశారన్నారు. కొత్త జీతాల చెల్లింపుల ప్రక్రియను నిలిపివేయాలని సీఎస్ ను కోరామని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర్యనారాయణ తెలిపారు. పాత జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇస్తామన్నారు. పీఆర్సీ సాధన సమితి కింద అన్ని ఉద్యోగ సంఘాలు పనిచేస్తాయన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై కూడా ఉద్యమిస్తామన్నారు.
ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీని అనుమతించం
ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీని అనుమతించమని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, ట్రేడ్ యూనియన్ నేతలను మాత్రం ఉద్యమంలోకి అనుమతిస్తామన్నారు. సీపీఎస్ రద్దు అంశంపై గట్టిగా ఉద్యమిస్తా్న్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె చేస్తామని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బండి శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 24న సమ్మెపై నోటీసు ఇస్తామన్నారు. 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేస్తామన్నారు. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడతామని స్పష్టం చేశారు. 26న అన్ని తాలుకా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహానికి మెమొరాండం సమర్పిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు చేస్తామని బండి శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ చేస్తా్మన్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె చేపడతామన్నారు. ఉద్యోగ సంఘాల మధ్య ఎలాంటి భేధాభిప్రాయాలున్నా సాధారణ ఉద్యోగుల కోసం అంతా కలిసి పనిచేస్తామన్నారు. మంత్రుల కమిటీ ఏదో వేశామని ప్రభుత్వం చెబుతోందని, మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.
Also Read: ప.గో జిల్లాలో దళిత యువకుడు గెడ్డం శీను హత్య కేసు కలకలం - ప్రభుత్వంపై హర్షకుమార్ విమర్శలు