AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానాలు!
AP Government: ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానాలు విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు వేయనుంది.
AP Government: ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానాలు విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణాన్ని కాలుష్యం చేసే వారే అందుకు శిక్ష అనుభవించాలని తెలిపింది. ఈ క్రమంలోనే భారీగా జరిమానాలు విధించాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుగుణంగా జరిమానాలు వేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలిథిన్ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, విక్రయాలు.. ఈ కామర్స్ కంపెనీలపైన దృష్టి పెట్టాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ వినియోగంపై పట్టమ, గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ శాఖ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలని స్పష్టం చేసింది.
25 వేల రూపాయల నుంచి 50 వేల వరకు జరిమానా...
నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై తొలిసారి తప్పుగా పరిగణిస్తే... రూ.50 వేలు, రెండోసారి లక్ష రూపాయలు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులను స్టాక్ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. దీంతో పాటు సీజ్ చేసిన ఉత్పత్తులపై కిలోకు పది రూపాయల చొప్పున జరిమానా వేయనున్నారు. వీధి వ్యాపారులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగిస్తే.... 2500 రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. దుకాణాలు, సంస్థలు, మాల్స్ తదితర ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే.. 20 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
నెల రోజుల క్రితం ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలుపై వాయిదా
ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై విధించిన నిషేధాన్ని వాయిదా వేసింది. నిషేధం అమలుచేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. తయారీ సామగ్రి, టెక్నాలజీ మార్చుకోవాలని ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వాన్ని కోరారు. ఫ్లెక్సీ తయారీదారుల విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీదారులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని అధికారులను ఆదేశించారు. తయారీ సామగ్రి కోసం రూ.20 లక్షల వరకు రుణం అందించాలని సూచించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దును జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. 2027 నాటికి ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలన్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబరు 1వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం వాయిదా వేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.