Krishna Water Row : "ఆ నీళ్లు తెలంగాణ కోటానే".. కేఆర్ఎంబీకి ఏపీ లేఖ !
ఇన్‌ఫ్లో ఆగిపోయినా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఆ నీటిని తెలంగాణ కోటాలో లెక్క వేయాలని కోరింది.
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఆంధ్రప్రదేస్ సర్కార్ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖరాసింది. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోందని దీని వల్ల నీటి వనరులు వృధా అవుతున్నాయని.. తక్షణం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా చూడాలని లేఖలో కోరారు. విద్యుత్ ఉత్పతి వల్ల నీటిమట్టం తగ్గుతోందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నీటి మట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు తరలించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. చెన్నైకి కూడా తాగునీటిని సరఫరా చేయలేమని తెలిపారు.
అదే సమయంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా విడుదల చేస్తున్న నీటిని దిగువ ప్రాజెక్టుల్లోనూ నిల్వ ఉంచే పరిస్థితి లేదని.. నాగార్జున సాగర్, పులిచింతలలో పూర్తి స్థాయి నీటి మట్టాలు ఉన్నాయని వివరించారు. ఇలా వచ్చే నీరు వృధాగా సముద్రంలోకి పోతుందని అందుకే విద్యుత్ ఉత్పాదనలో కిందికి విడిచిపెట్టిన నీటిని తెలంగాణ కోటాలో కలపాలని కోరారు. ఈ లేఖపై కృష్ణా యాజమాన్య బోర్డు ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఇటీవల పెద్ద ఎత్తున వర్షాలు పడటం.. ఎగువ నుంచి వరదలు రావడంతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. వరద వస్తున్నంత కాలం విద్యుత్ ఉత్పాదన వల్ల ఎలాంటి సమస్యలు రాలేదు.
కానీ ఇప్పుడు ఇన్‌ఫ్లో ఆగిపోయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన చేయడం వల్ల దిగువకు నీరు వదలాల్సి వస్తోంది. పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని ఎత్తిపోసుకునే సామర్థ్యం తక్కువగా ఉండటం.. అదీ కూడా 854 అడుగులు నీరు ఉన్నప్పుడే నీరు తోడుకునే అవకాశం ఉండటంతో రాయలసీమకు నీటి తరలింపుపై ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. ప్రస్తుతం నదీ బోర్డులను కేంద్రం నోటిఫై చేసినప్పటికీ ఇంకా కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. ఇటీవల జరిగిన ఉమ్మడి బోర్డుల సమావేశానికి తెలంగాణ హాజరు కాలేదు. మరో తేదీ నిర్ణయించాలని కోరింది.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ వివాదం కారణంగా ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో రాక ముందే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల వంటి ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి చేసింది. దీని వల్ల పెద్ద ఎత్తున నీరు సముద్రంలోకి వెళ్లిపోయారు. అ సమయంలో ఏర్పడిన వివాదం కారణంగా ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాయడంతో నదీ బోర్డులను కేంద్రం నోటిఫై చేసింది. అయితే నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను అందులో కలపడంతో రెండు ప్రభుత్వాలూ అసంతృప్తితో ఉన్నాయి.