AP Pension Distribution: ఏపీలో 2 విధాలుగా పెన్షన్ పంపిణీ, మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్
AP Pension Money Distribution: ఏపీలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 వరకు పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
Andhra Pradesh Pension News: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య పెన్షన్ టాపిక్ పై విమర్శలు, ఆరోపణల యుద్ధం కొనసాగుతోంది. పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అవ్వా తాతలకు పెన్షన్లు ఇవ్వడానికి వైసీపీ సర్కార్ కు మనసు రాక, తమపై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
2 విధాలుగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం (ఏప్రిల్ 3) నుంచి అవ్వాతాతలకు, ఇతర లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు విధానాల్లో పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైనవారు, వితంతువులకు మాత్రం ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేయనున్నారు. మిగతా విభాగాల పెన్షన్ లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ద్వారా పింఛన్ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుదూర ప్రాంతాల నుంచి పింఛన్ కోసం వచ్చే గిరిజన ప్రాంతాల వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.
రాత్రి 7 గంటల వరకు పనిచేయాలి..
ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అసలే ఎన్నికల టైమ్ కావడంతో పాటు పింఛన్ల పంపిణీకి తగినంతగా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవటంతో 2 విధాలుగా పింఛన్లు పంపిణీకి సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ సేవలు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం పింఛన్ల పంపిణీ ప్రారంభించి.. ఏప్రిల్ 6 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సర్కార్ ఆదేశించింది.
ఎన్నికల కోడ్ తెచ్చిన తిప్పలు..
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాలంటీర్లతో పెన్షన్ నగుదు పంపిణీ చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించింది. వాలంటీర్లు పెన్షన్ నగదును లబ్ధిదారులకు నేరుగా ఇవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రధాన ఎన్నికల ఆధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో సైతం వాలంటీర్లు పొల్గనకూడదని, ఎవరైనా ప్రచారం చేసినట్లు గుర్తిస్తే వారిని విధుల నుంచి తప్పిస్తూ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈసీ రూల్స్, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తప్పిస్తున్నారు. మరోవైపు తమను పెన్షన్ల పంపిణీకి దూరం చేయడంతో వాలంటీర్లు కొన్ని ప్రాంతాల్లో రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేసి తాము గత నెల వరకు పెన్షన్లు పంపిణీ చేసిన ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
Also Read: ఏపీలో అధికారులపై ఈసీ కొరడా - ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై బదిలీ వేటు !