Andhra Pradesh : తల్లికి వందనం పథకంపై వైసీపీ అనుమానాలు - ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే
AP Governament : తల్లికి వందనం పథకంపై వస్తున్న విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని స్పష్టం చేసింది.
Talli ki vandanam scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న తల్లికి వందనం పథకం విషయంలో గతంలో చెప్పింది ఒకటి.. ఇప్పుడు మరొకటి చేస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంట్లో ఎంత మందికి పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం స్కీం కింద సాయం చేస్తామన్నారని ఇప్పుడు తల్లికి మాత్రమే చేస్తామంటున్నారని వైసీపీ నేతలు రెండు రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు. తాజాగా పేర్ని నాని కూడా అవే విమర్శలు చేశారు.
ప్రజలు హ్యాపీగా లేరన్న పేర్ని నాని
వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టిన పేర్ని నాని కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు అమలు చేయడానికి మాత్రం ఆలోచిస్తున్నారని అన్నారు. కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప ప్రజలు సంతోషంగా లేరన్నారు. జగన్ మోహన్ రెడ్డి పథకం అమ్మ ఒడిని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు మార్చి తీసుకువచ్చారని ... చదువుకునే ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. తల్లికి వందనం పేరుతో జీవో ఎంఎస్.29 విడుదల చేశారని అన్నారు. ఇందులో తల్లికి మాత్రమే ఇస్తామని ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తాం అని చెప్పారని ఒకరైతే రూ.15 వేలు, ఇద్దరైతే రూ.30 వేలు, ముగ్గురైతే రూ.45 వేలు, నలుగురైతే రూ.60 వేలు ఇస్తామన్నారని ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు.
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదు - మాజీ సీఎం జగన్ సహా ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు
పిల్లలందరికీ ఇవ్వాలన్న గుడివాడ అమర్నాథ్
మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ పథకంపై స్పందించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు అమలుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానం ఉందన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో నిమ్మల రామానాయుడు ఎన్నికల సమయంలో చెప్పిన వీడియోను ఆయన మీడియాకు చూపించారు.
ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదన్న ప్రభుత్వం
తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. పథకం అమలుకు సంబంధించి ఇంత వరకూ మార్గదర్శకాలు ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. జీవో ఎంఎస్.29 కేవలం ఆధార్ నిబంధనలేనని స్పష్టం చేసింది. అందులో ఎక్కడా ఒక్కరికే ఇస్తామని చెప్పలేదని స్పష్టం చేసింది. పథకం అమలుపై ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సమీక్ష చేయలేదు. అర్హతలు ఖరారు చేయలేదు. అయితే ఆధార్ నిబంధనల ప్రకారం ఇచ్చిన జీవో కారణంగా వివాదం ప్రారంభమయింది.