AP Scheme Names: ఏపీలో పలు పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం, కొత్త పేర్లు ఇవే
Scheme Names Changed in AP | కూటమి ప్రభుత్వం ఏపీలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాల పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. పథకాల కొత్త పేర్లు శనివారం వెల్లడించారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వం పలు పథకాల పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలకు తాము గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అయిదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నామని ఏపీ ఐటీ , విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలనేది తమ సంకల్పం అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలుత వైసీపీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లకు స్వస్తి పలికినట్లు వెల్లడించారు. విద్యారంగంలో విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేశామన్నారు. ఈరోజు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలామ్ (APJ Abdul Kalam) వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్పూర్తితో నూతన పథకాల పేర్లను ప్రకటించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి స్కీమ్ పేరును తల్లికి వందనంగా నామకరణం చేసింది. ఈ పేరు మార్చడంపై ఇటీవల నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యా కానుక పథకంను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు. అదే విధంగా జగనన్న గోరు ముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంగా ఏపీ ప్రభుత్వం నామకరణం చేసింది. మన బడి నాడు -నేడు పథకాన్ని ‘మన బడి - మన భవిష్యత్తు’ అని, స్వేచ్ఛ అనే పథకాన్ని బాలికా రక్ష గా మార్చారు. ఇక మాజీ సీఎం జగన్ పేరిట ఉన్న మరో పథకం జగనన్న ఆణిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా నామకరణం చేసింది కూటమి ప్రభుత్వం.
పథకాలు ప్రస్తుత పేరు - కొత్త పేరు
జగనన్న అమ్మ ఒడి - తల్లికి వందనం
జగనన్న విద్యా కానుక - సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర
జగనన్న గోరు ముద్ద - డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం
మన బడి నాడు నేడు - మన బడి - మన భవిష్యత్తు
స్వేచ్ఛ - బాలికా రక్ష
జగనన్న ఆణిముత్యాలు - అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం