AP Fiber Net Case: ఏపీ ఫైబర్ నెట్ కేసు... సీఐడీ ముందు హాజరైన ముగ్గురు నిందితులు... రూ.321 కోట్ల అవకతవకలు జరిగాయని సీఐడీ నివేదిక
ఏపీ ఫైజర్ నెట్ టెండర్ల కేసులో విచారణ ప్రారంభమైంది. ఇవాళ ముగ్గురు నిందితులను సీఐడీ విచారిస్తుంది.
ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ టెండర్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ విచారణ చేపట్టింది. నిన్న ముగ్గురికి సీఐడీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇవాళ మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో సీఐడీ విచారణకు ముగ్గురు హాజరయ్యారు. టెండర్ల సాంకేతిక మదింపు కమిటీలో సభ్యుడి ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఇన్‌క్యాప్ అప్పటి ఎండీ కె.సాంబశివరావు, టెరా సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ తుమ్మల గోపీచంద్ ఇవాళ్టి విచారణకు హాజరయ్యారు. విజయవాడ సత్యనారాయణపురంలో సీఐడీ ఎదుట సాంబశివరావు హాజరయ్యారు.
అసలేం జరిగింది
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ కు గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన తొలిదశ టెండర్లలో అక్రమాల జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ కేసు నమోదు చేసింది. టెండర్ల కమిటీలో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్, టెరా సాఫ్ట్‌వేర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. ప్రాజెక్టు నిర్వహణకు అర్హతలు లేకున్నా టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ సంస్థకు అక్రమంగా రూ.321 కోట్లకు కాంట్రాక్టు అప్పగించారని పేర్కొంది. ఈ మేరకు టెండర్ల విషయంలో అక్రమాలు జరిగాయని ఎఫ్ఐఆర్ లో సీఐడీ ప్రస్తావించింది.
ఆ కంపెనీకి టెండర్లు
తొలిదశ టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీ జులై 16న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సీఐడీ ప్రాథమిక విచారణ చేపట్టి 774 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారంగా సెప్టెంబర్ 9న కేసు నమోదు చేసింది. పలు సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. మొత్తం 19 మందిని కేసులో నిందితులుగా పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ ప్రాథమిక విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలిందని ఒక నివేదిక సిద్ధం చేసింది. నిబంధనలను విరుద్ధంగా టెరా సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టినట్లు సీఐడీ గుర్తించింది. కంపెనీని బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించి, నకిలీ పత్రాలతో టెండర్లు ఫైనల్ చేసినట్లు సీఐడీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. నిపుణుల అభ్యంతరాలను పక్కన బెట్టి రూ.321 కోట్ల విలువైన ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టారని తెలిపింది. పరిశీలన చేయకుండా పరికరాల కోసం రూ.120 కోట్లు చెల్లించినట్లు తేల్చింది.
Also Read: Krishnam Raju Health: అపోలో ఆసుపత్రికి కృష్ణంరాజు.. కంగారు పడొద్దన్న రెబల్ స్టార్ టీమ్
జాబితాలో వీరి పేర్లు
సీఐడీ ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాను పేర్కొంది. టెండర్ల టెక్నికల్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరించిన వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఇన్‌క్యాప్ మాజీ ఎండీ కె.సాంబశివరావు, టెరా సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఆ సంస్థ ఛైర్మన్ ఎస్‌ఎస్‌ఆర్ కోటేశ్వరరావు, ఎండీ టి.గోపీచంద్, డైరెక్టర్లు ఆర్.ఎస్.బక్కనవర్, టి.హనుమాన్ చౌదరి, డా.టి.వి.లక్ష్మి, టి.బాపయ్య చౌదరి, టి.పవనదేవి, కె.రామారావు, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సంస్థ, ఆ సంస్థ డైరెక్టర్లు ఎం.పి.శుక్లా, మహేంద్ర నెహతా, అరవింద్ ఖర్బందా, డా.ఆర్.ఎం.కస్తియా, రాజీవ్ శర్మ, బేలా బెనర్జీలను నిందితులుగా సీఐడీ తెలిపింది. వీరితోపాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరుల్నీ నిందితులుగా పేర్కొంది.