AP Employees Unions : పీఆర్సీ రిపోర్ట్‌పై మళ్లీ నిరాశ.. ఏపీ ఉద్యోగ సంఘాల అసంతృప్తి !
ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. కార్యదర్శుల కమిటీతో చర్చలకు పిలిచి పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఉద్యోగ సంఘ నేతలు మరోసారి అసహనానికి గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలకు మరోసారి ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన రెండు రోజులకే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో పే రివిజన్ కమిషన్ రిపోర్టు ఇస్తారని ఉద్యోగ సంఘాలు భావించాయి. ఉద్యోగ సంఘాల నేతలందరూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీకి వెళ్లారు. కానీ సమావేశంలో అధికారులు అసలు పీఆర్సీ రిపోర్ట్ గురించి ప్రస్తావించలేదు. మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేసినా నివేదిక ఇవ్వకపోవడంతో ఉద్యోగ సంఘ నేతలు అసహనానికి గురయ్యారు.
పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరారు. సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉందని ..ప్రస్తుత పరిస్థితుల్లో నివేదిక ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అసలు పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ఎలా చర్చిస్తామని ఉద్యోగ సంఘ నేతలు ప్రశ్నించారు. అయితే అధికారులు మాత్రం తిరుపతిలో సీఎం జగన్ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. సీఎం హామీ మేరకు 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. దీనిపై ఉద్యోగ సంఘ నేతలు అసహనానికి గురయ్యారు. సమావేశం నుంచి బయటకు వచ్చారు.
71 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మళ్లీ కార్యదర్శుల కమిటీకి ఇచ్చామని ఉద్యోగసంఘం నేతలు తెలిపారు. కార్యదర్శుల కమిటీది కాలయాపన తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని... ప్రభుత్వానికి పీఆర్సీఅంశంపై చిత్తశుద్ధి లేదని భావిస్తున్నామని ఉద్యోగ నేతలు తెిపారు. తమ కార్యచరణను కొనసాగిస్తామన్నారు.
Also Read: వాళ్లకి కూడా విద్యాదీవెన, వసతి దీవెన పథకాలివ్వాలి.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !
ఉద్యోగులతో .. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా పీఆర్సీ ప్రకటిస్తారేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఇప్పటికే మధ్యంతర భృతి కింద 27 శాతం ఇచ్చారు. దాంతోనే సరి పెడితే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. అందుకే పీఆర్సీ నివేదిక కోసం పట్టుబడుతున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పది రోజుల్లో పీఆర్సీనే ప్రకటిస్తామని అంటోంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి