Udayagiri Constituency: చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ఉదయగిరిలో చేతులు కలిపిన వైరి వర్గాలు
Andhra News: ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీలోని రెండు వర్గాలు కలసిపోయాయి. టికెట్ దక్కని బొల్లినేనికి చంద్రబాబు పార్టీ పదవి ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయ్యారు.

Udayagiri TDP News: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం విషయంలో చంద్రబాబు వ్యూహం వర్కవుట్ అయ్యేలా ఉంది. స్థానికంగా వైరి వర్గాలుగా ఉన్న ఇద్దర్ని ఆయన ఒక దగ్గరకు చేర్చారు. పార్టీ గెలుపుకోసం పనిచేయాలని సూచించారు. కేవలం సూచనే కాదు, అందులో ఒకరికి పార్టీలో కీలక పదవి కూడా ఇచ్చారు. ఇంకేముంది ఆయన మెత్తబడ్డారు. టికెట్ తనకు రాకపోయినా పర్లేదంటూ సైలెంట్ అయ్యారు. దీంతో టికెట్ దక్కించుకున్న వారికి లైన్ క్లియర్ అయింది. చంద్రబాబు చాణక్యాన్ని నెల్లూరు జిల్లా నాయకులు మెచ్చుకుంటున్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 2019లో వైసీపీ గెలిచింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినా కాలక్రమంలో ఆయన టీడీపీలో చేరారు. ఆల్రెడీ అక్కడ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పార్టీలోనే ఉన్నారు. అయితే గియితే వారిద్దర్లో ఒకరికి టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా అక్కడ ఓ ఎన్నారైని తెరపైకి తెచ్చారు. కాకర్ల సురేష్ అక్కడ టీడీపీ టికెట్ దక్కించుకున్నారు, ప్రచారం మొదలు పెట్టారు.
బొల్లినేని అలక..
వైసీపీనుంచి వచ్చి చేరిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ టికెట్ లేకపోవడంతో దిగాలు పడి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక బొల్లినేని రామారావు మాత్రం తనకు టికెట్ రాకపోవడంతో అలకబూనారు, కాకర్ల సురేష్ ని ఓడించి తీరతానంటూ ప్రతిజ్ఞ చేశారు. అక్కడితో టికెట్ దక్కిన సంతోషం కూడా కాకర్లకు లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే, తనకంటే ముందు టీడీపీ అభ్యర్థిగా చెలామణి అయిన బొల్లినేనితో వైరం తనకు మంచిది కాదని ఆయన కూడా కాస్త సైలెంట్ గా ఉన్నారు. బొల్లినేనిపై ఎక్కడా మాట తూలలేదు, ఆయన్ను విమర్శించలేదు. దీంతో చివరకు పంచాయితీ చంద్రబాబు వద్దకు చేరింది.
ఇక్కడ చంద్రబాబు తన చాణక్యాన్ని ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టాలని సూచించారు. ఆ పదవి వల్ల ఉపయోగం ఉన్నా లేకపోయినా బొల్లినేని కాదనలేకపోయారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పి ఉదయగిరికి వచ్చేశారు.
చేతులు కలిపిన బొల్లినేని, కాకర్ల..
ఇక ఉదయగిరిలో సీన్ మారింది. టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్.. బొల్లినేని రామారావుని కలసి అభినందనలు తెలిపారు. ఆయనకు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయనకున్న రాజకీయ అనుభవాన్ని జోడించి ముందుకు నడిపించాలని కోరారు. నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం కూడా బొల్లినేని రామారావు ఆధ్వర్యంలో జరగడం విశేషం. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 8 మండలాలకు సంబంధించిన కన్వీనర్ లు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు జాతీయస్థాయిలో పదవి రావడం పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు బొల్లినేని. తన అనుచరులు, అభిమానులు కూడా తనమాటపైనే ఉండాలని, పార్టీకోసం పనిచేయాలని ఆదేశించారు. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించి చంద్రబాబుకి ఆ విజయాన్ని బహుమతిగా ఇస్తామన్నారు. మొత్తానికి ఇద్దరు నేతలు చేతులు కలపడంతో ఈ కథ సుఖాంతమైనట్టు తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

