CS Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు
CS Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మ అస్వస్థతకు గురైయ్యారు. ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.
CS Sameer Sharma : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహిస్తుండగా సీఎస్ సమీర్ శర్మ ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో అధికారులు ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల సమీర్ శర్మ అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం సీఎస్ సమీర్ శర్మ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత ఆయన యథావిధిగా విధులకు హాజరవుతున్నారు. గురువారం ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
సమీక్ష చేస్తుండగా
ఇటీవలే అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తాజాగా గురువారం ఉన్నపళంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో బ్యాంకులకు చెందిన అధికారులతో సమీక్ష జరుపుతున్న సమయంలో సమీక్ష జరుపుతూనే సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆందోళనకు గురైన అధికారులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గత నెలలో గుండె సంబంధిత సమస్య కారణంగా ఉద్యోగానికి సెలవు పెట్టిన సమీర్ శర్మ... హైదరాబాద్ వెళ్లి గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సమయంలో ఆయన స్థానంలో ఏపీ ఇన్ ఛార్జీ సీఎస్ గా విజయానంద్ ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆపరేషన్ ముగించుకుని వచ్చిన సీఎస్ సమీర్ శర్మ ఉన్నట్టుండి సమీక్షా సమావేశంలోనే అస్వస్థతకు గురికావడం గమనార్హం.
సీఎస్ తో ఎస్బీఐ సిజియం బృందం భేటీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ నవీన్ చంద్ర ఝా అధికారుల బృందం గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మతో భేటీ అయింది. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేస్తున్న వివిధ రుణ సౌకర్యాలకు సంబంధించిన పథకాలు, బీమా పథకాలు, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి అమలు చేస్తున్న వివిధ పధకాల గురించి సిజియం నవీన్ చంద్ర ఝా సీఎస్ కు వివరించారు. అదే విధంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సేవల గురించి వివరించారు.
ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి డా.కెవివి. సత్యనారాయణ, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ పాల్గొన్నారు. అదే విధంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్లు దినేష్ గులాటి, రంగరాజన్, ఫంకజ్ కుమార్, ఎజీయంలు పి.విశ్వేశ్వరరావు, సత్య స్వరూపిణి, సచివాలయం ఎస్బీఐ మేనేజర్ సీఎస్ నాయుడు, అసోసియేట్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Chandrababu :ఎలక్షన్ తర్వాత జగన్ మళ్లీ జైలుకే, అయ్యన్న అరెస్టుపై చంద్రబాబు వార్నింగ్