Bhimavaram Blast: భీమవరంలో వరుస పేలుళ్లు.. సీఎం వైఎస్ జగన్ పర్యటనకు ముందు ఘటనలు.. హైటెన్షన్ లో జిల్లా యంత్రాంగం
ఏపీ సీఎం జగన్ నేడు భీమవరంలో పర్యటిస్తున్నారు. సీఎం పర్యటనకు ముందు భీమవరంలో వరుస పేలుళ్లు పోలీసులు, అధికారులను కలవరపెడుతున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు ముందు భీమవరంలో వరుస బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ఉండి రైల్వే గేటు సమీపంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ శబ్దానికి సమీప ప్రాంతంలోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. సీఎం జగన్ హెలిఫ్యాడ్ ల్యాండింగ్ అయ్యే ప్రాంతానికి సమీపంలోనూ బాంబు పేలుడు సంభవించడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. బాంబు స్క్వాడ్ బృందాలు హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు చేశాయి.
పేలుడుపై ఆరా తీస్తోన్న ఎస్పీ
సీఎం జగన్ పర్యటనకు ముందు భీమవరంలో బాంబు పేలుడు సంభవించడంపై అందరూ ఉలిక్కి పడ్డారు. పట్టణంలోని ఉండి రోడ్డులో జంట కాలువల సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ పక్కనున్న ఖాళీ ఈ ఘటన సంభవించింది. రంగంలోకి దిగిన పోలీసులు బృందాలు తనిఖీలు చేపట్టారు. సీఎం జగన్ పర్యటనకు ముందు పేలుడు సంభవించడంతో పోలీసు, అధికార యంత్రాంగాలు ఆందోళనకు గురయ్యాయి. సీఎం పర్యటన కోసం వచ్చిన బాంబ్ స్క్వా డ్ పేలుడు సంభవించిన ప్రాంతంలో తనిఖీలు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై ఆరా తీశారు. ఇది బాంబు పేలుడు వల్ల సంభవించలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. పాత ఫ్రిజ్‌లోని గ్యాస్ సిలిండర్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాల్లోని ఏదైనా బ్యాటరీ వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యా్ప్తులో పూర్తి విషయాలు తెలుస్తాయని ఎస్పీ తెలిపారు.
ఆవుకు తీవ్ర గాయాలు
పేలుడు సంభవించిన ప్రదేశానికి సమీపంలో పాత ఇనుప సామాను వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ దుకాణం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో పాత ఇనుప సామగ్రిని నిల్వ చేస్తుంంటారు. ఈ ప్రాంతంలో పచ్చిక ఉండడంతో పశువులు మేతకోసం వస్తుంటాయి. శుక్రవారం సాయంత్రం ఆవులు పచ్చగడ్డి మేస్తుండగా ఒక ఆవు గుర్తుతెలియని వస్తువుపై కాలు వేయడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి ఆవు కాలు పూర్తిగా దెబ్బతింది. ఆవుకు పొట్టభాగంలో కూడా తీవ్ర గాయమై కదలలేని స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు.
సీఎం జగన్ పర్యటన
సీఎం జగన్ ఇవాళ భీమవరంలో పర్యటిస్తున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరవుతున్నారు. శనివారం ఉదయం 11.15 గంటలకు వివాహ వేదిక కె–కన్వెన్షన్ భవనం సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి 11.25 గంటలకు కల్యాణ మండపానికి చేరుకుని వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుని తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.
భీమవరంలో మరో పేలుడు
భీమవరంలోని బైపాస్ రోడ్డులో కెమికల్ లారీ ట్యాంకర్ కు శుక్రవారం వెల్డింగ్ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ట్యాంకర్ విడిభాగాలు ఎగిరిపడ్డాయి. ట్యాంకర్ విడి భాగం విద్యుత్ తీగలపై పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేకపోవడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. లారీ ట్యాంకర్ పేలుడుపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Perni Nani Percentage : పర్సంటేజీలపై పేర్ని నాని సూక్తులు.. బాధ్యతా..! బాధ్యతా రాహిత్యమా..?