Cm Jagan: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలు అమలు చేశామని కామెంట్స్
మేనిఫెస్టోలో ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు. బటన్ నొక్కి అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేశారు.
అగ్రవర్ణ పేద మహిళల సాధికారత లక్ష్యంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలు కూడా అమలు చేసి చూపిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 45-60 ఏళ్ల మధ్య వయసున్న 3,92,674 మంది మహిళల ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి సీఎం జమ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ పాలన చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, క్షత్రియ, వెలమతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు.
Also Read: నేడే మహిళల ఖాతాల్లో నగదు జమ... ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
అక్కచెల్లెమ్మలకు మేలు చేసేలా
మహిళల ఆర్థిక అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం పాటుపడుతోందని సీఎం జగన్ అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా 45 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలను గత ప్రభుత్వం మోసం చేసిందన్న సీఎం ఆరోపించారు. ఆసరా పథకంతో డ్వాక్రా రుణాలను అందిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో 32 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ 5–10 లక్షల రూపాయల మేలు జరిగేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రూ.2 లక్షల పైగా ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్టు తెలిపారు. జగనన్న విద్యాదీవెనతో పిల్లల చదువులకు ఖర్చు అయ్యే ఫీజులను వారి ఖాతాల్లోనే వేస్తున్నామన్నారు.
రాజకీయంగా గుర్తింపు
మహిళలకు రాజకీయంగా కూడా ప్రాముఖ్యత ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. శాసనమండలిలో తొలి మహిళా వైస్ ఛైర్మన్‌గా జకియా ఖాన్ ను నియమించామన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పాముల పుష్ప శ్రీవాణి, మహిళా హోంమంత్రి సుచరితమ్మ ఉన్నారన్నారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్నిని పెట్టామని సీఎం జగన్ అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 51 శాతం కేటామన్న సీఎం...ఇందుకోసం చట్టం చేశామని చెప్పుకొచ్చారు.
Also Read: ఏపీలో మరో 13 కొత్త జిల్లాలు... ఉగాదిలోపు అమల్లోకి వచ్చే అవకాశం... నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల..!