(Source: ECI/ABP News/ABP Majha)
CM Jagan Covid Review : థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ రెడీ...! ఈ ప్రణాళిక అమలు చేస్తే అంతా సేఫ్ అంటున్న సీఎం జగన్
కరోనా మూడో దశలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా ప్రజలకు ఇబ్బంది రాకుండా సౌకర్యాలు కల్పించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌ను కరోనా ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు సీఎం జగన్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాల మధ్య ఆయన చేసిన సమీక్షలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌సిలెండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. 100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందేనని.. ఈ విషయంపై ప్రైవేటు ఆస్పత్రులకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ప్లాంట్ల ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ ప్రకటించారు.
విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయించడంతో.. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మే, జూన్, జులై నెలల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 43.38 లక్షల డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 డోసులు మాత్రమే వాడారు. మిగిలిన డోసులు కూడా ఏపీకి ఇస్తే.. వ్యాక్సినేషన్‌ను వేగంగా ముందుకు సాగుతుందని .. దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాయాలని జగన్ నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్ అనంతరం అక్కడి కోవిడ్ తీరు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకోసం ఒక కమిటీని నియమించాలన్నారు.
ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, ప్లాంట్ల నిర్వహణ కోసం సిబ్బంది అవసరం. నిపుణులు తక్కువగా ఉన్నారు. అందుకే ఐటీఐ, డిప్లమోలో దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కీలకమైన ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్, ఏసీ రిపేర్, ప్లంబింగ్‌తో పాటు ఇతర అనుబంధ వైద్య విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సి ఉందని.. స్కిల్డ్ మానవ వనరుల సేవల కారణంగా... ఆస్పత్రుల నిర్వహణ మెరుగ్గా ఉంటుందని ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. థర్డ్ వేవ్ చిన్న పిల్లలపై అధిక ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే.. చిన్న పిల్లల తల్లులందరికీ ఏపీలో వ్యాక్సినేషన్ ఇప్పటికే పూర్తి చేశారు.
ఏపీలో ప్రతిష్టాత్మకంగా కట్టాలనుకుంటున్న మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్‌లపైనా సీఎం జగన్ సమీక్షించారు. వీలైనంత త్వరగా వాటికి భూసేకరణ పూర్తి చేయాలని.. నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. నిర్మాణాలు ప్రారంభమైన వాటిపై.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు. సీఎం జగన్ ధర్డ్ వేవ్ విషయంలో ఏపీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.