AP Cabinet Decisions: ఆరు రకాల స్కూళ్లతో విద్యా విప్లవం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆగస్టు 16వ తేదీన విద్యార్థులకు విద్యాకానుక పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. విద్యారంగంపై కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
![AP Cabinet Decisions: ఆరు రకాల స్కూళ్లతో విద్యా విప్లవం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు Ap cabinet taken key decisions AP Cabinet Decisions: ఆరు రకాల స్కూళ్లతో విద్యా విప్లవం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/01/e61501c432903c587ada91e37be28dca_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల రూపురేఖలు మొత్తం మార్చేయాలని తీసుకున్నట్లుగా మంత్రి పేర్ని నాని ప్రకటించారు. నాడు-నేడు కింద రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేశామని ఆయన మంత్రి వర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. మెరుగైన విద్య అందించాలన్నదే సీఎం జగన్ ఆకాంక్షగా స్పష్టం చేశారు. పూర్తిగా ఇంగ్లిష్ మీడియం మాత్రమే అమలు చేయబోతున్నందున ఏ తరగతికైనా తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంచాలని నిర్ణయించారు. ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని పేర్ని నాని తెలిపారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా గవర్నమెంట్ స్కూళ్లలో చేరే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని పేర్ని నాని తెలిపారు. ఈ విద్యా సంవత్సవరంలో కొత్తగా 6,22,856 మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరేందుకు ఎన్ రోల్ చేసుకున్నారని తెలిపారు. ఏపీలో అమలు చేయబోతున్న నూతన విద్యావిధానంలో స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరించారు. ప్రీ స్కూళ్లను శాటిలైట్ స్కూల్స్ గా అభివర్ణిస్తారు. తర్వాత ఫౌండేషన్ స్కూల్స్ , ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ ఉంటాయి. ఇవన్నీ రెండో తరగతి వరకూ పాఠాలుగా చెబుతారు. తర్వాత ప్రీ హైస్కూల్స్ ఉంటాయి. వీటిలో 3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తారు. తర్వాత కేటగరిలో హైస్కూల్స్ ఉంటాయి. వీటిలో మళ్లీ 3 నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తారు. హైస్కూల్ ప్లస్ అనే మరో కేటగిరీలో 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది.
ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్, ప్రతి తరగతికి ఒక తరగతి గది ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా చదువులో వెనుకబడకూడదనేదే సీఎం లక్ష్యమని పేర్ని నాని తెలిపారు. పిల్లలందరికీ విద్యాకానుకను.. స్కూళ్ల ప్రారంభోత్సవం రోజు అయిన ఆగస్టు పదహారో తేదీన అందిస్తారు.
మంత్రి వర్గ సమావేశంలో ఇతర కీలక అంశాలపైనా చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన నగదు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే వాలంటీర్ల దగ్గర బాధితులు వివరాలు నమోదు చేసుకుంటున్నారు. 10వేల రూపాయాల నుంచి 20 వేల లోపు డిపాజిట్ చేసిన.. అగ్రిగోల్డ్ బాధితులకు ఈ సారి నగదు ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు కూడా నిర్ణయించారు. వీటిని ఎప్పటి నుండి ఇస్తారో మాత్రం.. మంత్రి క్లారిటీగా చెప్పలేదు. విద్యారంగంలో సంస్కరణలు లక్ష్యంగా మంత్రివర్గ భేటీ జరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)