AP BJP In Delhi : సోము వీర్రాజును మార్చాల్సిందే - ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతల పంచాయతీ !
సోము వీర్రాజును మార్చాలని ఏపీ బీజేపీ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వల్ల పార్టీ నాశనం అవుతోందన్నారు.
AP BJP In Delhi : ఆంధ్రప్రదేశ్ బీజేచూడాలనిపీలో ముసలం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నేతలు దాదాపుగా 30 మంది ఢిల్లీలో ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్‌తో సమావేశం అయ్యారు. పార్టీలో పరిస్థితులు.. సోము వీర్రాజు, జీవీఎల్ చేస్తున్న నిర్వాకాలపై పూర్తి స్థాయి నివేదిక అందించారు. తక్షణం సోము వీర్రాజను తప్పించాలని.. జీవీఎల్‌ను ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా వారు మురళీధరన్‌కు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేతలంతా కొద్ది రోజుల కిందటే విజయవాడలో సమావేశం అవ్వాలనుకున్నారు. కానీ అలా సమావేశం అయితే బాగుండదని.. కావాలంటే అందరూ ఢిల్లీ రావాలని హైకమాండ్ సమాచారం పంపింది.
హైకమాండ్ సూచనలతో ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీజేపీ ముఖ్య నేతలు.. తాము చెప్పాలనుకున్నదంతా చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీని వదిలి టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కన్నా లక్ష్మినారాయణ పార్టీలో చేరిపోయారు. ఆయన వర్గం అంతా టీడీపీలోకి వెళ్లడం ఖాయమే. ఇక ఆయనతో సంబంధం లేకుండా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసహనంతో.. మరికొంత మంది తెలుగుదేశం వైపు చూస్తున్నార్న ప్రచారం జరుగుతోంది. కొంత మంది నేతలు ఇప్పటికే చర్చలు జరిపారని కూడా చెబుతున్నారు.
ఢిల్లీలో మురళీధరన్‌తో భేటీ అయిన వారిలో రాష్ట్ర బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిషోర్, టెక్కలి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్, కృష్ణాజిల్లా మాజీ అధ్యక్షుడు కుమారస్వామి, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కె.బాజి, బొడ్డు నాగలక్ష్మి, శ్రీనివాసరాజు, శ్రీకాకుళం, ఒంగోలు జిల్లాల మాజీ అధ్యక్షులతోపాటు పలువురు నేతలున్నారు. తాము మొదటి నుంచి బీజేపీ కార్యకర్తలుగా ఉన్నామని.. రాష్ట్రంలో బీజేపీకి ఇలాంటి పరిస్థితిని తాము ఎప్పుడూ చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చేరిన వారిని కోవర్టులనే ముద్ర వేసి దూరంగా ఉంచారని.. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వారిని దూరం పెట్టారని వీరు ఆరోపిస్తున్నారు.
బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధర్ ను కలిసిన వారిలో లేకపోయినా పురందేశ్వరి, ఆదినారాయణరెడ్డి, వరదాపురం సూరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు వంటి వారు అటు సోము వీర్రాజు.. ఇటు జీవీఎల్ నరసింహారావు తీరుపై అసంతృప్తిగా ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. అలాగే బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సోము వీర్రాజే వచ్చే ఎన్నికల నాటికి అధ్యక్షుడిగా కొనసాగితే పార్టీ మరింత నష్టపోతుందని వీరంతా ఆందోళన చెందుతున్నారు.