AP BJP On Davos Row : దావోస్ టూర్స్‌కి వెళ్లి ఏం సాధించారో బయట పెట్టండి ? టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలకు ఏపీ బీజేపీ సవాల్ !
గత ఎనిమిదేళ్లుగా ఏపీ నుంచి దావోస్ పర్యటనలకు వెళ్లిన వివరాలు, వచ్చిన పెట్టుబడులు బయటపెట్టాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేసింది. నిజాయితీ నిరూపించుకోవాలని.. విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు.
AP BJP On Davos Row : ఆంధ్రప్రదేశ్‌లో దావోస్ పెట్టుబడుల అంశం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. దావోస్ నుంచి ఆహ్వానం రాలేదని.. ఏపీ ప్రభుత్వానికి సిగ్గు చేటని.. టీడీపీ విమర్శలు చేస్తోంది. అయితే ఆహ్వానం వచ్చిందని.. గతంలో చంద్రబాబే దావోస్ కు వెళ్లి పెట్టుబడులు ఏమీ తీసుకు రాలేదని ఆరోపణలను మంత్రి అమర్నాథ్ చేశారు. ఈ వివాదంపై ఏపీ బీజేపీ స్పందించింది. రెండు పార్టీలు చేసుకుంటున్న పరస్పర ఆరోపణలను గుర్తు చేసిన ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.. నిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి 2022 వరకు దావోస్ వెళ్లి తేదేపా-వైకాపా ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల్లో ఒక్కటి కూడా కార్యరూపం ఏపీ లో దాల్చలేదు అని మీరే అంటున్నారు?వాస్తవం మీ రెండు పార్టీలు ప్రజలు ముందు ఉంచి వైకాపా , తెదేపా పార్టీలు , జగన్ , చంద్రబాబు చిత్తశుద్ధి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ప్రతీ ఏడాది ప్రతినిధి బృందంతో దావోస్ వెళ్లేవారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని ప్రకటించేవారు. అయితే పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ దావోస్ నుంచి టీడీపీ హయాంలో ఎలాంటి పెట్టుబడులు తేలేదని ప్రకటించారు. దావోస్ వెళ్లి తాను చాలా ఘనత సాధించానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడును ఆ సదస్సులో మాట్లాడమని నిర్వాహకులు ఎప్పుడైనా ఆహ్వానించారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. మన రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు కూడా మాట్లాడుకోవాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన.. మన గురించి మనమే మాట్లాడుకోవాలన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన. దావోస్ సదస్సులో మైక్రోసాఫ్ట్ అధినేతలను కలిశానని, ఆంధ్రప్రదేశ్ కు మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తోందని చంద్రబాబు నాయుడు ప్రకటించిన మరుక్షణమే తాము ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏర్పాటు చేయడం లేదని ఆ సంస్థ అధినేతలు చెప్పటం ఎంత సిగ్గుచేటని అమర్నాథ్ ప్రశ్నించారు
ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మాత్రమే తీసుకువచ్చారని, కరోనా పరిస్థితులను కూడా తట్టుకొని జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తున్నారని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి కార్య దీక్ష, పట్టుదల చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ముందే రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు.
ఇలా రెండు పార్టీల నేతల మధ్య వివాదం ఏర్పడటంతో.. ఏపీ బీజేపీ స్పందించింది. రెండు పార్టీలు కలిసి.. దావోస్ యాత్రలకు వెళ్లినప్పుడు.. ఏం సాధించారో చెప్పాలని డి్మాండ్ చేస్తోంది. *అది విహార యాత్ర, లేక ఒప్పందాల యాత్రనా ? ఏంటి ఈ దావోస్ వాస్తవం ? అని ప్రశ్నించారు. 2014 నుంచి 2022 వరకు దావోస్ వెళ్లి తేదేపా-వైకాపా ప్రభుత్వాలు పార్టీలు , జగన్ , చంద్రబాబు చిత్తశుద్ధి నిజాయితీని నిరూపించుకోమని సవాల్ చేస్తున్నారు. మరి ఈ అంశంపై రెండు పార్టీలు స్పందిస్తాయా ? అని ఏపీ బీజేపీ ప్రశ్నిస్తోంది.