CM Jagan On Jangareddigudem : 54 వేల జనాభాలో 90 మంది మరణించడం సహజమే-జంగారెడ్డిగూడెం ఘటనపై సీఎ జగన్
CM Jagan On Jangareddigudem : జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలని, టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందని సీఎం జగన్ అన్నారు. కల్తీ మద్యాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు.
CM Jagan On Jangareddigudem : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలని(Normal Deaths) సీఎం జగన్(CM Jagan) ను అన్నారు. శాసనసభలో జంగారెడ్డిగూడెం మరణాలపై మాట్లాడిన సీఎం...జంగారెడ్డిగూడెం జనాభా యాభైవేలకు పైగా ఉంటుందన్నారు. ఇంత పెద్ద మున్సిపాలిటీలో అక్కడక్కడా జరిగిన మరణాల సంఖ్య రెండు శాతం అనుకున్నా కనీసం తొంభైమంది సహజంగా చనిపోతారన్నారు. అలాంటిది ఇలా కేవలం సహజ మరణాలను కూడా వక్రీకరించి టీడీపీ(TDP) రాద్దాంతం చేస్తుందని సీఎం జగన్ అన్నారు. కల్తీ మద్యం చేసేవాళ్లను ఎందుకు సపోర్ట్ చేస్తామని సీఎం అన్నారు. చంద్రబాబు(Chandrababu) హయాంలో జరిగినట్లే ఇప్పుడు అక్కడక్కడా నాటుసారా సమస్య ఉందని సీఎం అన్నారు. అందుకే ప్రత్యేక పోలీసు ఫోర్స్ తీసుకొచ్చామన్నారు. కల్తీ మద్యాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమన్నారు.
పర్మిట్ రూమ్ లు రద్దు
రాష్ట్రంలో లిక్కర్ వినియోగం తగ్గించాలని ఆలోచిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. 43 వేల బెల్ట్ షాపులు లేకుండా చేశామన్నారు. నాలుగు వేల మూడువందల నలభై పర్మిట్ రూమ్‌లు రద్దు చేశామన్నారు. టీడీపీ హయాంలో లాభాపేక్షతో మద్యం(Liquor) విచ్చల విడిగా అమ్మించేవాళ్లని సీఎం ఆరోపించారు. ఇప్పుడు లాభాపేక్ష లేకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తోందన్నారు. లిమిటెడ్ అవర్స్‌లో దొరికే పరిస్థితికి తీసుకొచ్చామన్నారు. షాక్ కొట్టేలా ధరలతో లిక్కర్ వినియోగం తగ్గిందన్నారు.
అక్రమ మద్యం తయారీదారులపై కేసులు
"ప్రతిపక్షాలు, పోలీసులు, ఇతర సంస్థల సూచనతో అక్రమ మద్యం తగ్గించేందుకు రేట్లు ఇటీవల తగ్గించాం. గత ప్రభుత్వం అమ్మే రేట్లకు మద్యం తీసుకొచ్చాం. కల్తీ మద్యం తయారుదారులను రక్షించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. సహజమరణాలను కూడా మద్యం తాగి చనిపోయినట్టు చెప్పడం బాధ కలిస్తోంది. కల్తీ, అక్రమ మద్యం తయారీదారులపై 13,000 కేసులు నమోదు చేశాం." అని సీఎం జగన్ అన్నారు.
మంత్రి ఆళ్ల నాని వివరణ
జంగారెడ్డిగూడెంలో మరణాలపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి ఆళ్లనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందన్నారు. నలుగురు చనిపోతే 18 మంది చనిపోయారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సహజ మరణాలపై కూడా టీడీపీ అపోహలు సృష్టిస్తోందన్నారు. టీడీపీ డ్రామాలకు కొన్ని పత్రికలు వంత పాడుతున్నాయన్నారు. బాధితుడు మరణించిందని మద్యం వల్లకాదు గుండెనొప్పితో అని మృతుడి భార్యే స్వయంగా ప్రకటిందన్నారు. టీడీపీ సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు.