Anil Kumar Yadav : అందుకే ఓడిపోయాం, ఎక్కడికీ పారిపోం అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
Anil Kumar Yadav Comments : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై వైసీపీ నేత అనిల్‌కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ వెంటే ఉంటామని, ఆయనతోనే నడుస్తామన్నారు.
Anil Kumar Yadav YCP Defeat : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాని రితీలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. మరీ ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ వంటి వారు భారీ మెజార్టీతో ప్రత్యర్థులను మట్టి కరిపించారు.
వైసీపీ ఘోర ఓటమి
ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ.. ఈ సారి ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ జనసేన పార్టీకంటే కూడా తక్కువ స్థానాలకు పరిమితమైంది. 11అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్ సీట్లతో సరిపుచ్చుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహం కారణంగా వైసీపీ కంచుకోటగా భావించే స్థానాల్లో సైతం ఆ పార్టీ అభ్యర్థులు ఓడిమి పాలయ్యారు. ఊహించని విధంగా వైసీపీ పరాజయం పాలుకావడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఓటమిపై స్పందించిన అనిల్ కుమార్
ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నోటి దురుసు వల్లే ఓడిపోయామంటూ చాలా మంది అంటున్నారు. అదే నిజమైతే ఇకపై సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. తాడేపల్లిలో అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తున్నామన్నారు. లోపాలు సరిదిద్దుకుని భవిష్యతులో ముందుకు వెళ్తామన్నారు. గత ఎన్నికల్లో తమకు ఎక్కువ మొత్తంలో సీట్లు రాకపోయినా.. 40 శాతం ఓట్ల షేర్ ఉందన్నారు. తమకు ప్రతిపక్షం కొత్తేమీ కాదని.. పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నామంటూ గుర్తు చేశారు. ఓడిపోయామని ఇంట్లో కూర్చోమని.. గతంలో కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడ్డామన్నారు. ప్రస్తుతం కూడా అలాగే ఉంటామన్నారు. ఓటమి పాలై భయపడి ఎక్కడికీ పారిపోమని.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. అధికార పార్టీకి కొంత సమయం ఇస్తామని.. ఆ తర్వాత వాళ్ల తప్పులపై పోరాడుతామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైసీపీ అధినేత జగన్ వెంటే ఉంటామని, ఆయనతోనే నడుస్తామన్నారు. తమ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదంటూ హితవు పలికారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని తెలిపారు.