World Cup Final: ప్రపంచ కప్ ఫీవర్ - విశాఖ, విజయవాడల్లో భారీ స్క్రీన్ల వద్ద యువత సందడి
Andhra News: భారత్ - ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ కప్ తుది పోరు కొనసాగుతోంది. రాష్ట్రంలో క్రికెట్ అభిమానుల కోసం పలు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయగా, యువతి పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
World cup Final 2023: అహ్మదాబాద్ (Ahmadabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ తుది (World cup Final) సమరం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) క్రికెట్ అభిమానుల కోసం ఏపీలో విశాఖ, విజయవాడ సహా పలు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ప్రవేశం పూర్తిగా ఉచితం కావడంతో మ్యాచ్ వీక్షించేందుకు పెద్ద ఎత్తున యువత తరలివస్తున్నారు. భారత్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ స్క్రీన్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. ఆయా చోట్ల వేల మంది మ్యాచ్ వీక్షించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా వారికి అందుబాటు ధరల్లో ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంచారు.
ప్రత్యేక పూజలు
కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారత్ గెలవాలని పెద్ద ఎత్తున పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. కొన్ని చోట్ల ప్రపంచ కప్ మనేదనంటూ ర్యాలీ చేపట్టారు. తెలుగు రాష్ట్రాల కీలక నేతలు, పలువురు ప్రముఖులు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇండియా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల కూడా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అనంతపురంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ), ఏలూరులో ఇండోర్ స్టేడియం గ్రౌండ్, గుంటూరులో మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్, కడపలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, కర్నూలులో DSA స్టేడియం, నెల్లూరులో VR హైస్కూల్ గ్రౌండ్, ఒంగోలులో జెడ్పీ మినీ స్టేడియం, శ్రీకాకుళంలో MH స్కూల్ గ్రౌండ్, తిరుపతిలో KVS స్పోర్ట్స్ పార్క్, విజయనగరంలో ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద పెద్ద స్క్రీన్ల వద్ద కూడా క్రికెట్ అభిమానులు సందడి చేస్తున్నారు.
ఆటగాళ్ల ఫోటోలతో అయ్యప్ప సన్నిధి
విజయనగరం జిల్లా రాజాం మండలం గడ్డవలసకి చెందిన అయ్యప్ప స్వాములు.. టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని సన్నిధానంలో ఇండియా క్రికెట్ ఆటగాళ్ల ఫోటోలతో అయ్యప్ప స్వామికి 18 మెట్లతో గుడి కట్టారు. 'భారత్‌మాతాకీ జై', 'ఆల్ ద బెస్ట్ ఇండియా' అంటూ నినదించారు. అటు, బాపట్ల జిల్లా చీరాలలోనూ క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. పేరాలలోని పుణుగు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివయ్యకు అభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టారు. "ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా" అంటూ క్రికెట్ అభిమానులు నినాదాలు చేశారు.
Also Read: TTD Darshan: వీకెండ్స్‌లో తిరుమలకు వెళ్తున్నారా? ఆ రోజుల్లో ఇబ్బందులు లేకుండా దర్శనం ఇలా!