TTD Darshan: వీకెండ్స్‌లో తిరుమలకు వెళ్తున్నారా? ఆ రోజుల్లో ఇబ్బందులు లేకుండా దర్శనం ఇలా!
TTD News: కోవిడ్ అనంతరం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం కాంప్లెక్స్ లో టైం స్టార్ట్ టోకెన్లను టిటిడి పునఃప్రారంభించింది.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడు కొండల్లో ఎటు చూసినా భక్తజనమే కనిపిస్తున్నారు. అధిక రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొదలుకొని నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్స్, నాలుగు మాడవీధులు, గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. శ్రీనివాసుడి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల పైగా సమయం పడుతుంది. వారాంతరాలు కావడంతో ముఖ్యంగా భక్తుల రద్దీ పెరిగింది.
కలియుగ వైకుంఠనాథుడి దర్శనార్థం దేశ విదేశాల నుండి వివిధ రూపాల్లో భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఇలా చేరుకున్న భక్తులు వివిధ పద్ధతుల రూపంలో స్వామి వారి దర్శనం పొందుతూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జితసేవ, సర్వదర్శనం వంటి పద్ధతుల్లో స్వామి వారిని భక్తులు దర్శించి పునీతులు అవుతుంటారు.
కోవిడ్ అనంతరం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం కాంప్లెక్స్ లో టైం స్టార్ట్ టోకెన్లను టీటీడీ పునఃప్రారంభించింది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే టైం స్లాట్ టోకెన్లు పూర్తి అవుతున్నాయి. దీంతో మరుసటి రోజు సంబంధించిన టైం స్లాట్ టోకెన్లు సైతం టీటీడీ జారీ చేస్తుంది. ఈ క్రమంలో టోకెన్లు పొందలేని భక్తులు నేరుగా తిరుమలకి చేరుకుని వైకుంఠం కాంప్లెక్స్-2 ద్వారా స్వామి వారిని దర్శించుకునేందుకు చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్స్ నిండిపోయి బయట స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్స్ లో వేచి ఉన్నారు.
దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపుగా 30 గంటలకు పైగా సమయం పడుతుంది. స్వామి వారి దర్శన భాగ్యం పొందేందుకు గంటల తరబడి తిరుమలలోని శిలాతోరణం మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సామాన్య భక్తులు క్యూ లైన్స్ లో వేచి ఉన్నారు. క్యూలైన్స్ లో వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్న ప్రసాదం, పాలు, నీరు వంటివి టీటీడీ అధికారులు నిరంతరాయంగా అందిస్తూ వస్తున్నారు. కొండపై భక్తుల రద్దీ నేపథ్యంలో భక్తులు అధికంగా ఉండే ప్రదేశాల్లోనూ స్వామి వారి దర్శనం వెళ్లే ప్రాంతాల్లోనూ, దర్శన అనంతరం బయటకు వచ్చే ప్రాంతాల్లోనూ టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారుల సమన్వయంతో పకడ్బందీ బందోబస్తు నిర్వర్తిస్తున్నారు.
ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాల నిఘాలో నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శుక్ర, శని ఆదివారాల్లో సిఫారసు లేఖలపై అందించే వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కేవలం ప్రోటోకాల్ పరిధిలోని వచ్చే విఐపి భక్తులకు మాత్రమే బ్రేక్ దర్శనం టీటీడీ కల్పిస్తుంది. భక్తుల రద్దీ నేపధ్యంలో గదుల కేటాయింపు కేంద్రం వద్ద భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్ధితి నెలకొంటుంది. గదుల కేటాయింపు కేంద్రం వద్ద భక్తుల రద్దీ ఉండడంతో భక్తులు చాలా మంది రోడ్డు ఇరువైపుల సేద తీరుతున్నారు.