AP Telangana Today Updates: దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎగ్జిబిషన్ సోసైటీ కోసం శక్తివంచన లేకుండా పని చేస్తా: హరీశ్ రావు
ఎగ్జిబిషన్ సోసైటీ మరింత ప్రగతి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని తనను కలిసిన సోసైటీ యాజమాన్య కమిటీ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు అన్నారు. తన బాధ్యత మరింత పెరిగిందన్న ఆయన ప్రతిష్టాత్మక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని అన్నారు. గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామని అన్నారు. సోసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామని అన్నారు.
కిషన్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చేరుకుంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అంబర్ పేటకు చాలా రోజుల తర్వాత వచ్చానని అన్నారు. బిడ్డ తన తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తాను దిల్లీలో ఉన్నానంటే అందుకు కారణం అంబర్‌పేట ప్రజలు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే అని అన్నారు. కేంద్రమంత్రి అయినందుకు తనకు సంతోషం లేదని.. అంబర్‌పేటకు దూరమయ్యానన్న బాధ మాత్రం ఉందని అన్నారు. గతంలో అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే.





















