Weather Latest Update: బలహీనపడిన ఉపరితల ఆవర్తనం- ఆ జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్
Rains in Andhra Pradesh and Telangana | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ నుంచి 5.8 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం నెలకొంది. అయితే ఉపరితల ఆవర్తనం తాజాగా బలహీనపడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు, ఉత్తర కేరళతో పాటు దక్షిణ కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు ఉన్న మరో ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయి.
త్వరలో బంగాళాఖాతంలో రెండు తుపానులు ఏర్పడనుండగా, అరేబియా సముద్రంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణిగా మారే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాలపై పడుతుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏపీలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
District forecast of Andhra Pradesh dated 07-10-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/GH5r1icxYP
— MC Amaravati (@AmaravatiMc) October 7, 2024
ఏపీ, యానాంలకు రెండు రోజుల వర్ష సూచన
నేడు, రేపు ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురవనున్నాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయి. కర్నూలు, కడప, అనంతరం, చిత్తూరు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన కనిపిస్తోంది. వర్ష సూచనతో ఏపీలో అన్ని జిల్లాలకు రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
#24HrWx
— Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) October 7, 2024
- Easterlies have set in across peninsular #India marking the withdrawal of SW monsoon features.
- Due to interaction between moist Easterlies and Westerlies, coastal #Kerala and coastal #Karnataka can get severe thunderstorms.
- Partially cloudy sky but reduced rainfall… pic.twitter.com/3SKPl4AMRi
తెలంగాణలో వాతావరణం ఇలా..
తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిజిల్లాల్లో ఒకట్రెండు చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువ వర్షాలు పడతాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్, జిల్లాలలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తాయి. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఒక్కసారిగా వర్షం కురిసే అవకాశం ఉంది. చిరుజల్లు ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాత్రివేళ ఉక్కపోత పూర్తిగా తగ్గడంతో నగరవాసులు రిలాక్స్ అవుతున్నారు.