AP Schools Reopen: ఏపీ బడుల్లో కరోనా కలవరం.. పదిరోజుల్లో 50 మంది విద్యార్థులకు కరోనా... ఆందోళనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
ఏపీలోని ప్రభుత్వ బడుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాఠశాలలు తెరుచుకుని పది రోజులు గడిచాయి. ఈ పది రోజుల్లో సుమారు 50 విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కరోనా బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా వీరేపల్లి, వెదుల్లచెరువు పాఠశాలల్లో 9 మంది, పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి, వట్లూరు జడ్పీ హైస్కూళ్లలో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకింది. కృష్ణా జిల్లా శంకరంపాడు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు చిన్నారులకు కరోనా సోకిందని తేలింది. ప్రకాశం జిల్లా పాఠశాలల్లో కరోనా బాధితుల సంఖ్య 22కు చేరింది. విద్యార్థులు కరోనా బారిన పడడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
పది రోజుల్లో 50 మందికి కరోనా
ఏపీలో పాఠశాలలు తెరిచిన పది రోజుల్లో సుమారు 50 మంది విద్యార్థులు, 31 మంది ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకింది. వీరిలో ఇద్దరు మూడో తరగతి విద్యార్థులు, ఒకరు నాల్గో తరగతి విద్యార్థి ఉన్నారు. దీంతో అధికారులు ఆ పాఠశాలకు సెలవులు ప్రకటించారు.
ఈ పాఠశాలకు మూడు రోజులు సెలవులు ప్రకటించినట్లు నాగాయలంక మండల విద్యాశాఖ అధికారి(MEO) రామదాసు తెలిపారు. ఇతర విద్యార్థులకు కూడా కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఉపాధ్యాయులకు కరోనా
పాఠశాలలు తెరిచినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో 17 మంది ఉపాధ్యాయులు, 10 విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. జిల్లాలోని డక్కలి మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి కోవిడ్ సోకింది. విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు కరోనా బారినపడ్డారు. దీంతో ఆయా పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
ఆ పాఠశాలలపై ప్రత్యేకదృష్టి
కరోనా తర్వాత స్కూళ్లు తెరిచి పదిరోజులు గడిచిందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. 75 నుంచి 85 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారని ఆయన చెబుతున్నారు. పాఠశాలలో కోవిడ్ నిబంధనలను, భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మాస్కుల వినియోగాన్ని కూడా తప్పనిసరి చేశామన్నారు. కరోనా కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్న మంత్రి... ఆయా పాఠశాలలో విడతల వారీగా క్లాసులు ప్రారంభిస్తామన్నారు.