AP Deputy CM: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
Andhra Pradesh News | నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటున్న టిడిపి లీడర్లు - హై కమాండ్ ఆశీస్సులతోనే అంతా జరుగుతుందా? అని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు.

Nara Lokesh as AP Deputy CM | టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను ఏపీ కి ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ డిమాండ్ పెరుగుతోంది. మొదట్లో పార్టీ క్యాడర్ నుంచి మొదలైన ఈ డిమాండ్ ప్రస్తుతం పార్టీ లీడర్ల వరకు పాకిపోయింది. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలంటూ వినిపిస్తున్న డిమాండ్ల వెనకాల పార్టీ హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయా అన్న కొత్త చర్చ ఇప్పుడు మొదలైంది.
సడన్ గా తెరపైకి వచ్చిన " లోకేష్- డిప్యూటీ సీఎం" డిమాండ్
ఒక నాలుగు రోజుల క్రితం పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు లీడర్లు నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ కొన్ని యూట్యూబ్ చానళ్ల లో మాట్లాడారు. అదేదో అత్యుత్సాహపరుల డిమాండ్ గా అందరూ భావించినా ఆ ప్రచారం నెమ్మదిగా ఊపందుకుంటోంది. రెండు రోజుల క్రితం కడప జిల్లాలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే టిడిపి నేతలు ఈ డిమాండ్ ను వినిపించారు. పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి "కేడర్ లో ఆత్మస్థైర్యం పెరగాలంటే లోకేష్ ను ఉపముఖ్యమంత్రి చేయాలంటూ " మాట్లాడారు. నిన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత వర్మ కూడా "లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని అనడంలో తప్పేంటి అంటూ " సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనితో ఇదేదో ఆషామాషీ వ్యవహారంగా ఎవ్వరూ చూడడం లేదు. నిజానికి ఇలాంటి డిమాండ్లపై హైకమాండ్ సీరియస్ గా ఉంటే క్యాడర్ గాని లీడర్లు గాని ఆటోమెటిగ్గా సైలెంట్ అయిపోతారు. కానీ అటువంటిది ఏమీ లేకుండా రోజు రోజుకి ఈ డిమాండ్ పెరుగుతుంది అంటే దీనికి హై కమాండ్ ఆశీస్సులు ఉన్నాయా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో పెరుగుతున్నాయి.
"యువ గళం " నుంచి ఇప్పటివరకూ టిడిపిలో అంతా లోకేష్ నే
ఒకప్పుడు లోకేష్ ను అపహాస్యం చేసిన వాళ్లే ఇప్పుడు ఆయన దూకుడు చూసి సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఏపీ రాజకీయాల్లో కనబడుతోంది. యువగళం మొదలుకొని చంద్రబాబు అరెస్టు సమయంలో పోరాడిన వైనం.. కూటమి ఏర్పాటు అయిన సమయంలో సమయానికి తగ్గట్టుగా వ్యవహరించడం.. ప్రసంగాల్లో పెరిగిన పదును లోకేష్ ఇమేజ్ ని టోటల్ గా మార్చేశాయి. ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలాంటి పనైనా నారా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతుందన్న ప్రచారం బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లోనే లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ లీడర్ల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
పవన్ ఎఫెక్ట్ కారణమా?
లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అన్న డిమాండ్ వెనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు కారణమా అన్న మరొక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ దూకుడు వల్ల నారా లోకేష్ ఇమేజ్ వెనకబడిపోతారంటూ టిడిపి అనుకూల మీడియా సంస్థలు గా పేరు పడ్డ ఒకరిద్దరు అధినేతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కూటమి గెలుపులో నారా లోకేష్ పాత్రను కూడా తక్కువ చేసి చూడలేం అనేది వారి అభిప్రాయం. కొత్తతరం రాజకీయాలకు నారా లోకేష్ దూకుడు కరెక్ట్ అనీ కాబట్టి ఆయన్ను డిప్యూటీ సీఎం చేయడానికి ఇదే సరైన సమయం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ తో సమానంగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే టిడిపి క్యాడర్ను సంతృప్తి పరిచినట్లు ఉంటుందని పార్టీ పెద్దలు చంద్రబాబుతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే కూటమి ఏర్పాటులో కీలకపాత్ర వహించిన పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది కలగకుండా చూడాలనేది చంద్రబాబు ఆలోచన గా చెబుతున్నాయి పార్టీ వర్గాలు. కాబట్టి వెంటనే కాకుండా సరైన సమయం చూసి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతున్నట్టు ప్రచారం గుప్పమంటోంది. అయితే లోకేష్ సన్నిహితవర్గాలు మాత్రం ఇది పూర్తిగా నిరాధారమైన ప్రచారం అంటూ కొట్టి పారేస్తున్నాయి. కానీ ప్రాంతీయ పార్టీల్లో హై కమాండ్ కు తెలియకుండా ఇంత కీలకమైన ప్రచారం జరగడం అసాధ్యం అనేది సీనియర్ ఎనలిస్టుల అంచనా. మరి ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో నారా లోకేష్ కేంద్రంగా ఎలాంటి సంచలనాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.





















