Central Funds to Andhra : వైసీపీ హయాంలో ఏపీకి కేంద్ర పథకాలకు ఎన్ని నిధులు వచ్చాయో తెలుసా ?
Andhra Pradesh : కేంద్ర ప్రాయోజిత పథకాలకు వైసీపీ హయాంలో ఎన్ని నిధులు మంజూరు చేశారో లెక్కలు విడుదల చేశారు. రాష్ట్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ల ప్రకారమే విడుదల చేసినట్లుగా తెలిపారు.
YCP regime Funds From Central Cabinet : 2019- 24 మధ్య కాలంలో ఏపీకి కేంద్రం ప్రాయోజిత పథకాల్లో భాగంగా ఎన్ని నిధులు వచ్చాయో చెప్పాలని టీడీపీ ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, కేశినేని శివనాథ్‌లు వేసిన ప్రశ్నకు కేంద్రం లఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకానికి రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్లు రిలీజ్ చేయాల్సి ఉంటుదని.. కేంద్ర నిబంధనల ప్రకారం ఇలా మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చిన పథకాలకు.. ఎప్పటికప్పుడు నిధులు వినియోగించుకున్నట్లుగా తెలిపే యుటిలిటీ సర్టిఫికెట్లు సమర్పించిన వరకూ నిధులు మంజూరు చేసినట్లుగా తెలిపింది.
2019 -20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఏపీకి రూ. 11, 003 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 12, 928 కోట్లు, 2021-22లో 9,696 కోట్లు, 2022-23 లో 16,114 కోట్లు, 2023-24లో 13, 313 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం లోక్ సభకు లిఖితపూర్వకంగా తెలిపింది.
కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తేనే నిధులు వస్తాయి. ఆ ప్రకారం రాష్ట్రం ఎంత మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించిందో కూడా వివరించారు. 2021-22లో రాష్ట్రం 12167 కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ ను కేటాయించింది. అయితే ఇందులో అంతకు ముందు ఏడాదివి కూడా ఉన్నాయి. తర్వాత 2022-23 ఆర్థికి సంవత్సరంలో రూ 6582 కోట్లు, 2023-24లో 8023 కోట్ల రూపాయలు కేటాయించారు. మ్యాచింగ్ గ్రాంట్లకు తగ్గట్లుగా నిధులు రాష్ట్రానికి మంజూరయ్యాయి.
గతంలో కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ర ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కేటాయించకపోవడం వల్లనే.. రాష్ట్రానికి రాలేదన్న విమర్శలు ఉన్నాయి.వివిధ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల నిర్వహించిన సమీక్షల్లో జల్ జీవన్ మిషన్ కు సంబంధించి భారీగా నిధులు తెచ్చుకునే అవకాశం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం వల్ల నిధులు రాలేదని గుర్తించారు.
కేంద్ర పథకాల విషయంలో నిధులు పొందాలంటే కేంద్రం చెప్పిన షరతులు పాటించారు. ప్రతి పథకానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. రాష్ట్రం తన మ్యాచింగ్ గ్రాంటు మొత్తాన్ని అదే ఖాతాలో జమ చేసి... సంబంధిత పథకాన్ని నిక్కచ్చిగా అమలు చేయాల్సి ఉంటుంది. 130 కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి 130 సింగిల్ నోడల్ ఏజెన్సీ బ్యాంకు ఖాతాలను గత ప్రభుత్వం తెరిచింది. అయితే చాలా పథకాలకు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లను రిలీజ్ చేయకపోవడంతో.. వాటికి సంబంధించిన నిధులు జమ కాలేదు. ఓ పది నుంచి ఇరవై కేంద్ర పథకాలను మాత్రమే.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో భాగంగా అమలు చేసి ఉంటారని మిగతా అన్నింటినీ వదిలేయడంతో వేల కోట్లు ఏపీకి రావాల్సినవి రాకండా పోయాయన్న విమర్శలు ఉన్నాయి.