(Source: ECI/ABP News/ABP Majha)
Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య
Sub Registrar Suicide: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో సత్యసాయి జిల్లాలో విషాదం అలుముకుంది.
Sub Registrar Suicide in Chennai: సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో (Bukkapatnam) లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ (42) (Srinivas nayak) కథ విషాదాంతమైంది. ఈ నెల 22న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆయన, అధికారుల కళ్లుగప్పి పరారయ్యారు. అవమాన భారంతో కుంగిపోయిన నాయక్ తాజాగా చెన్నైలోని (Chennai) లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. రైటర్, సబ్ రిజిస్ట్రార్ ను అర్ధరాత్రి వరకూ విచారిస్తుండగా, భోజన విరామం సమయంలో శ్రీనివాస్ నాయక్ అధికారుల కళ్లుగప్పి పరారయ్యారు. సబ్ రిజిస్ట్రార్ పరారయ్యేందుకు ఓ వ్యక్తి ఆయనకు సహకరించినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అధికారి కోసం గాలింపు చేపట్టారు.
చెన్నై పోలీసుల సమాచారం
సీసీ ఫుటేజీ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కోసం పోలీసులు గాలిస్తుండగా, ఆయన చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి పోలీసులు సమాచారం అందించారు. మాధవాపురంలోని ఓ లాడ్జిలోని గదిలో శనివారం ఉరేసుకున్నట్లు నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీనివాస్ నాయక్ ను గుర్తించి ఇక్కడ పోలీసులకు తెలిపారు.
ఇదీ జరిగింది
సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన లింగాల సురేంద్రారెడ్డి అనే రైతు తన సొంత ఆస్తిని మార్చిలో రిజిష్టర్ చేసుకున్నారు. అందుకు అప్పట్లో రూ.30 వేలు లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, స్టాంప్ డ్యూటీ తక్కువతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆడిట్ లో తేలిందంటూ, మరో రూ.లక్ష ఇవ్వాలని డాక్యుమెంట్ రైటర్ శ్రీహరి, సదరు రైతుపై ఒత్తిడి తెచ్చారు. చివరకు రూ.50 వేలకు ఒప్పందం కుదరగా, ఈ నెల 16న బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు సురేంద్రారెడ్డి ఈ నెల 22న సాయంత్రం సురేంద్రరెడ్డి రూ.10 వేలు తీసుకుని సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లగా, డాక్యుమెంట్ రైటర్ కు ఇవ్వాలని సూచించారు. అనంతరం డబ్బులను రైటర్ నుంచి సబ్ రిజిస్ట్రార్ కు అందగానే ఏసీబీ అధికారులు దాడి చేసి సబ్ రిజిస్ట్రార్ సహా రైటర్ శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారిస్తుండగా సబ్ రిజిస్ట్రార్ వారి కళ్లుగప్పి పరారై, అవమాన భారంతో చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో సత్యసాయి జిల్లాలో విషాదం నెలకొంది.
వైద్యుడి ఆత్మహత్య
మరోవైపు, కాకినాడలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆస్తి విషయంలో తాను మోసపోయానంటూ అశోక్ నగర్ కు చెందిన డాక్టర్ నున్న శ్రీకిరణ్ చౌదరి (32) శనివారం గడ్డి మందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. కొందరి బెదిరింపుల వల్లే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడినట్లు మృతుడి తల్లి రత్నం ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
Also Read: Chandrababu Naidu: రేపు ఢిల్లీకి చంద్రబాబు, సిద్ధార్థ్ లుత్రా కుమారుడి రిసెప్షన్‌కు హాజరు