Cyclone Ditva alert: శ్రీలంకలో వందల మందిని బలి తీసుకున్న తుపాన్ దిత్వా - ఏపీలోని అలజడి రేపేందుకు రెడీ - ఇవిగో జాగ్రత్తలు
Ditwah: దిత్వా తుపాన్ ప్రభావం ఏపీపైనా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.. రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

Cyclone Ditva: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ (Ditwah) తుఫాను ప్రస్తుతం శ్రీలంక తీరం వద్ద కేంద్రీకృతమై ఉంది. కారైక్కల్ నుంచి 220 కి.మీ., పుదుచ్చేరి నుంచి 330 కి.మీ., చెన్నై నుంచి 430 కి.మీ. దూరంలో ఉంది. గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతోంది. ఆదివారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారి, తమిళనాడు-పుదుచ్చేరి-దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
ఈ తుఫాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శనివారం విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంగళవారం వరకు ఒక్క మత్స్యకారుడు కూడా సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని సీఎస్ ఆదేశించారు. రైతుల వరిపొలాలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడకముందే పంట కోత, ఎండబెట్టడం, సురక్షిత స్థలాలకు తరలించడం లాంటి చర్యలు వేగవంతం చేయాలన్నారు. విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) & RTGS ద్వారా SMSల ద్వారా ప్రజలు, రైతులకు అప్రమత్త సందేశాలు పంపాలి. కూలిన ఇళ్లలో ఉంటున్న వారిని ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అవసరమైతే రిలీఫ్ క్యాంపులకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి. గాలులకు చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించి రోడ్లపై ట్రాఫిక్ అడ్డంకులు రాకుండా చూడాలని సూచించారు. విద్యుత్ సరఫరా తెగిపోతే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి. భారీ వర్షాల సమయంలో ప్రజలు ఇంటి దగ్గరే ఉండేలా అప్రమత్తం చేయాలి. బలమైన గాలులు వీస్తున్నప్పుడు చెట్లు, హోర్డింగ్స్ దగ్గరకు వెళ్లొద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని మార్గదర్శకాలు ఇచ్చారు.
దిత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ, దక్షిణ తీర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా, సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని వాతావరణ శాఖ కోరింది.
‘దిత్వా’ తుఫాను శ్రీలంక తీరాన్ని తాకడంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు, మట్టిబొడ్లు సంభవించాయి. మొత్తం 123 మంది మరణించగా, 130 మంది మిస్సింగ్‌గా ఉన్నారు. 25 జిల్లాల్లో 63 వేల కుటుంబాలు (2 లక్షల మంది) ప్రభావితమయ్యారు. ఈ తుఫాను శ్రీలంకకు 2017 తర్వాత అతి తీవ్ర విపత్తుగా మారింది. తుఫాను ఇప్పుడు భారత తీరం వైపు కదులుతోంది, కానీ శ్రీలంకలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి తుఫాను శ్రీలంకను వదిలి భారత తమిళనాడు వైపు కదులుతున్నా, దాని పరోక్ష ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం దిత్వా ప్రభావం ఇండియాపై కనిపిస్తోంది.





















