Anantapur: తుంగభద్రలో పుష్కలంగా నీళ్లు, అయినా ఇవ్వట్లేదు - మాజీ ఎమ్మెల్యే అనంత
Anantapur News: వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియామకం తర్వాత తొలిసారి అనంత వెంకటరామి రెడ్డి అనంతపురం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
Ananta Venkata Rami Reddy: తుంగభద్ర డ్యాంలో నీరు పుష్కలంగా ఉన్నా రైతాంగానికి ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతాంగం ఏకంగా 5 లక్షల ఎకరాలకు పైగా విత్తనం వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియామకం తర్వాత తొలిసారి అనంతపురం జిల్లాకు విచ్చేసిన అనంతను గురువారం పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆయన స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామి రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తనను నియమించినందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రభుత్వానిది డైవర్షన్ పాటిలిక్స్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అయ్యిందని, కేవలం పింఛన్లు ఇవ్వడం మినహా చేసిందేమీ లేదని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన కూడా చేయలేకపోతున్నారని అన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చలేక, సమస్యలను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పాయని విమర్శించారు.
5 లక్షల ఎకరాలకు పైగా సాగుచేయని రైతులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌కు గాను సుమారు 5 లక్షల ఎకరాలకు పైగా విత్తనం వేయలేని పరిస్థితి నెలకొందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వేసిన పంట కూడా చేతికందే పరిస్థితి లేదని అన్నారు. అనంతపురం జిల్లాలో 68 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 52 శాతం వరకు మాత్రమే పంటల సాగు జరిగందన్నారు. ఈ ఖరీఫ్‌లో జూలై, ఆగస్టు మాసాల్లో విత్తనాలు వేయని పరిస్థితి నెలకొందని.. జూన్‌లో సాగు చేసిన పంటలు కూడా చేతికందని దయనీయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐఏబీ సమావేశం వాయిదా బాధాకరం
ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు (ఐఏబీ) సమావేశం వాయిదా వేయడం బాధాకరమని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. విజయవాడలో వరద సమస్య ఉందని మీటింగ్ వాయిదా వేశారని, ఇక్కడ రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని గుర్తు చేశారు. తక్షణం ఐఏబీ సమావేశం నిర్వహించి నీటి కేటాయింపులు, తేదీలు ఖరాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కూడా చర్చించినట్లు చెప్పారు. ఇటీవల తుంగభద్ర డ్యాం వద్ద గేట్ సమస్య వచ్చిందని, ఇప్పుడు డ్యాంలో నీరు పుష్కలంగా ఉన్నా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. తక్షణం తాగు, సాగు నీటి అవసరాల కోసం హెచ్‌ఎల్‌సీకి నీరు విడుదల చేయలని డిమాండ్ చేశారు.