Lokesh : ఓ పిల్లాడితో టీడీపీ టీ షర్ట్ విప్పించేసిన లోకేష్ - ఎందుకంటే ?
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
Lokesh : కర్నూలు జిల్లాలో నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో బుధవారం ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో చేపట్టిన యువగళం పాదయాత్రలో అందరితో పాటు పసుపురంగు టీషర్టు వేసుకున్న ఒక బాలుడు పాల్గొనడాన్ని లోకేష్ గమనించారు. ఉత్సాహంగా యాత్రలో పాల్గొంటున్న ఆ బాలుడ్ని లోకేష్ దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించి కుశలప్రశ్నలు వేశారు. చదువుకునే చిన్న పిల్లలు ఇలా పార్టీ రాజకీయాల కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది కాదని లోకేష్ భావించారు. ఆపై ఆ బాలుడితో “ఇప్పుడే రాజకీయాలు వద్దురా. ముందు మంచిగా, బాగా చదువుకో ” అని వాడు వేసుకున్న టీషర్టు తీయించి నచ్చజెప్పి పంపించేశారు.
యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరువగా ఉంది. ఆలూరు నియోజకవర్గంలో భారీ ప్రజా స్పందన మాధ్య పాదయాత్ర సాగుతోంది. ఒక బాబాయ్ ని చంపిన కేసులో ఇంకో బాబాయ్ జైలుకి వెళ్లడం ఖాయమని... అది కూడా జగన్ జైలు చంచల్ గూడకి వెళ్లడం కచ్చితంగా దేవుడి స్క్రిప్టేనని యువనేత నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలూరు నియోజకవర్గం వలగొండ క్రాస్ వద్ద యువగళం పాదయాత్రలో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడుతూ... వివేకా హత్య కేసులో జగన్ డ్రామా ట్రూప్ చిన్న లాజిక్ మిస్సైయిందని అన్నారు. వివేకా గారిని ఒప్పిస్తే అవినాశ్ ఎంపీ అవుతాడు... వివేకా గారిని చంపేస్తే నేరస్తులు అవుతారు... ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ జగన్ అని ఎద్దేవా చేశారు.
యువగళం పాదయత్రకి ముందు జగన్ ఒక నియంత. నన్ను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇంతకంటే పెద్ద నియంతలను ఫుట్ బాల్ ఆడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం తగ్గుతామా? లారీల్లో వస్తారో, రౌడీలతో వస్తారో రండి తేల్చుకుందాం అని సవాల్ చేస్తే తోకముడిచి పారిపోయారన్నారు. పాదయాత్ర ప్రారంభం అయిన తరువాత అన్ని వర్గాల ప్రజలు నియంతని నిలదీయడం మొదలు పెట్టారు. యువత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియంత కొమ్ములు వంచారు. పాదయాత్ర ప్రారంభం అయిన 74 రోజులకే జగన్ కమెడియన్ గా మారిపోయాడు. ఆఖరికి కుక్కలు, కోతులు కూడా ఆయన స్టిక్కర్ చూసి అసహ్యించుకుంటున్నాయి" అని పేర్కొన్నారు.
బెంజ్ మంత్రి గారి భార్య రేణుక గారు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్లపైన ఆస్పరి మండలంలో ఇటినా కంపెనీ నుంచి 180 ఎకరాలు కొనుగోలు చేశారని లోకేశ్ ఆరోపించారు. ఈ భూములు బినామి పేర్లతో లెక్కల్లో చూపని ఆదాయంతో కొన్నారని, ఇవి అక్రమాస్తులే అని ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. "వాటిని తాత్కాలిక అటాచ్ చేసింది. ప్రభుత్వ ధర ప్రకారం ఎవరైనా రిజిస్ట్రేషన్ కి డబ్బులు చెల్లిస్తే ఆ భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని బెంజ్ మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ధర ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ డబ్బు మేము చెల్లిస్తాం. మంత్రి గారు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చెయ్యడానికి సిద్ధమా అని సవాల్ చేశారు.