Nara Lokesh AT SIT Office: సిట్ ఆఫీసులోకి లోకేష్, భువనేశ్వరి - కానీ చంద్రబాబును కలిసేందుకు అనుమతించని అధికారులు
Nara Bhuvanwswari and Nara Lokesh went inside SIT Office: చంద్రబాబును చూసేందుకు భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, మరికొందరు కుటుంబసభ్యులను సిట్ ఆఫీసులోకి పంపించారు.
Nara Bhuvanwswari and Nara Lokesh went inside SIT Office:
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులను Sit కార్యాలయం లోకి అనుమతించారు. సీఐడీ అధికారులు చంద్రబాబును చూసేందుకు భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, మరికొందరు కుటుంబసభ్యులను సిట్ ఆఫీసులోకి పంపించారు. నేటి ఉదయం నుంచి చంద్రబాబును కలిసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేతను కలిసేందుకు చంద్రబాబు కుటుంబసభ్యులను సిట్ కార్యాలయంలోకి అధికారులు అనుతించారు. కానీ చంద్రబాబు వద్దకు కుటుంబసభ్యులను తీసుకెళ్లలేదు. చంద్రబాబు కుటుంబసభ్యులను అధికారులు 4వ అంతస్తులో కూర్చోబెట్టారు. చంద్రబాబు 5వ అంతస్తులో విచారణ ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
తన తరపున అడ్వకేట్లను అయినా లోపలకి అనుమతించాలని సీఐడీ అధికారులకు చంద్రబాబు లేఖ రాశారు. తన లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు, ఎం. లక్ష్మీ నారాయణ, శరత్ చంద్రలను కలిసేందుకు అనుమతించాలని లేఖలో చంద్రబాబు కోరారు.
మరోవైపు బాలకృష్ణ, బ్రాహ్మణి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. నేటి ఉదయం స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలతో చంద్రబాబు నాయుడును పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేశారు. సాయంత్రానికి తాడేపల్లి లోని కుంచనపల్లి సీఐడీ సిట్ కార్యాలయానికి చంద్రబాబును తరలించారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిందని బాలయ్య ఆరోపించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకున్నా చంద్రబాబును అరెస్ట్ చేశారని, స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో కోర్టు ఏపీ సర్కారుకు చీవాట్లు పెట్టిందని గుర్తుచేశారు. తాను ఎలాగూ జైళ్లో ఉన్నానని, చంద్రబాబును సైతం జైల్లో పెట్టాలని జగన్ తాపత్రయం అని, ఛార్జిషీటు లేకున్నా, కేసులో పేరు లేకున్నా కక్ష సాధింపు ధోరణితో టీడీపీ అధినేతను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారని బాలకృష్ణ ఆరోపించారు.
అంతకుముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ నేతలతో కలిసి లాయర్లతో సమావేశం అయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ చేసిన ఆరోపణలు, ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నేటి ఉదయం యువగళం పాదయాత్ర నుంచి తన తండ్రి చంద్రబాబును కలిసేందుకు బయలుదేరిన లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు కుటుంబసభ్యులకు కచ్చితంగా అనుమతి ఇస్తామని చెప్పినట్లే పోలీసులు రాత్రి అందుకు పర్మిషన్ ఇచ్చారు. కుటుంబసభ్యులను 4వ ఫ్లోర్ లో కూర్చోబెట్టగా, చంద్రబాబు 5వ ఫ్లోర్ లో ఉన్నారని సమాచారం.