Janasena News: సీఎం జగన్ నరసాపురం కామెంట్స్‌పై నాదెండ్ల ఫైర్, సూటి ప్రశ్నలతో నిలదీత
వైఎస్ఆర్ సీపీ రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకు జనసేన రౌడీసేన అవుతుందా అని ప్రశ్నించారు.
సీఎం జగన్ కాకినాడ జిల్లా నరసాపురం పర్యటన సందర్భంగా జనసేన పార్టీపైన, పవన్ కల్యాణ్‌పైన చేసిన విమర్శలపై ఆ పార్టీ కీలక నేత, రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. సీఎం జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయన మాటలను ఖండించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వీర మహిళలు, జనసైనికులను జగన్ కించపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అసహనం, ఆందోళనకు నిదర్శనమని తెలుస్తోందని అన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా నాదెండ్ల మనోహర్ ప్రశ్నలు సంధించారు.
వైఎస్ఆర్ సీపీ రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకు జనసేన రౌడీసేన అవుతుందా అని ప్రశ్నించారు. మత్స్యకారులకు వైఎస్ఆర్ సీపీ చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? అని నిలదీశారు. ‘‘పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా? మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు జనసేన పార్టీ నుంచి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రాష్ట్రంలో రోడ్ల హీన పరిస్థితిని తెలిపినందుకా? మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా?’’ అని నాదెండ్ల నిలదీస్తూ మాట్లాడారు.
‘‘నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను, వీర మహిళలను, జన సైనికులను, జనసేన పార్టీని కించపరుస్తూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయి! జనసేన ఎందుకు రౌడీ సేన? జగన్ వైఎస్ గారూ? మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? ఆడ బిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా?’’ అని నాదెండ్ల మనోహర్ విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలివీ..
ముఖ్యమంత్రి జగన్ కాకినాడ జిల్లా పర్యటన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన విమర్శలు చేశారు. టీడీపీ అంటేనే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని సీఎం ఎద్దేవా చేశారు. దత్త పుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చేశారని ఆరోపించారు. వీరు గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా ఇదేం ఖర్మ అనుకున్నారని, అందుకే 2019లో దత్త పుత్రుడు, సొంత పుత్రుడు ఇద్దర్నీ అన్నీ చోట్లా ఓడగొట్టారని గుర్తు చేశారు.
బాయ్ బాయ్ బాబు అంటున్నారు - జగన్
మనం చేసిన ఇంటింటి అభివృద్ధిని గుర్తించి ప్రజలు.. ప్రతి ఒక ఉప ఎన్నికలోనూ, జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. చివరికి కుప్పం మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ టీడీపీని చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. దీంతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బాయ్ బాయ్ బాబు అని చెప్పారని అన్నారు. ఇదేం ఖర్మరా బాబూ అని చంద్రబాబు తలపట్టుకొని, ఆయన పుత్రుడు, దత్త పుత్రుడు కూడా ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని విమర్శలు చేశారు.