టీడీపీతోపాటుగా చంద్రబాబు పతనం "అన్ స్టాపబుల్": మంత్రి అంబటి
అసెంబ్లీలో పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు టాక్ షోకి పరిమితమయ్యారని... బాబుకు తానా తందానా అన్న బామ్మర్ది బాలకృష్ణని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.
టీడీపీతోపాటుగా చంద్రబాబు పతనం "అన్ స్టాపబుల్" అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. జగన్ విజయం - వైఎస్ఆర్సీపీకి 175 స్థానాల రావడం కూడా అన్‌స్టాపబుల్ అని ఆయన జోస్యం చెప్పారు. ఎన్టీఆర్‌ను చంపి.. ఆయన ఆశయాలు సాధిస్తారా అని నిలదీశారు. అధికారం కోసం గోతి కాడ నక్కలా క్కూర్చున్న చంద్రబాబు, రియల్ విలన్ అని వెన్నుపోటు రక్తపు మరకను చెరిపేసే ప్రయత్నమే ఆ టాక్ షో పెట్టారని తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో విమర్శించారు.
అసెంబ్లీలో పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు టాక్ షోకి పరిమితమయ్యారని... బాబుకు తానా తందానా అన్న బామ్మర్ది బాలకృష్ణని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. మూడు రాజధానుల నిర్ణయాన్ని అడ్డుకుంటున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. పోగాలం దాపురించి టీడీపీ తీసుకున్న నిర్ణయాలతో మూడు ప్రాంతాల ప్రజల్లో చైతన్యం వచ్చిందని తెలిపారు. ఆ షో కు లక్ష్మీపార్వతి, నాదెండ్ల భాస్కరరావును పిలిస్తే వాస్తవాలు తెలిసేవని అన్నారు.
లోకేష్ ఒక బఫూన్.. బాలకృష్ణ అమాయకుడు, అసమర్థుడని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు. వైఎస్ఆర్ స్నేహితుడు అని చెబుతున్న బాబు.. వైఎస్ దగ్గర పాకెట్ మనీ తీసుకున్నానని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఈ షోలో లోకేష్ హాస్యనటుడిలా ఉన్నారని... బాలకృష్ణని బఫూన్, జోకర్ అనలేను కానీ, అమాయకుడు, అసమర్థుడు కూడా అని న్నారు. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉంటే చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ స్థాయిలో ఉన్నారన్నారు. బాలకృష్ణ సమర్థుడు అయితే చంద్రబాబు తన తమ్ముడు స్థాయిలో ఉండేవారని ఎద్దేవా చేశారు. అర్హతలు ఏమీ లేకపోయినా కుట్రలు, కుతంత్రాలు, మోసం, దగా రాజకీయాలతో అందలం ఎక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ధ్వజమెత్తారు.
బాబు వెన్నుపోటు మరక చెరిపివేసేందుకే..
మొత్తం టాక్‌షో చూస్తే బాలకృష్ణ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చూస్తే ప్రధానంగా ఒకటనిపిస్తుందన్నారు. 27ఏళ్ల క్రితం జరిగిన వెన్నుపోటు రక్తపు మరకను తుడిచేసుకునే ప్రయత్నం చేశారన్నారని అభిప్రాయపడ్డారు. బామ్మర్ది, బావ కలిసికట్టుగా రక్తపు మరకను తుడిచేసుకునేలా చేసిన ప్రయత్నం చాలా బాధ కలిగించిందన్నారు. పోగాలం దాపురిస్తే ఇలాంటి ఆలోచనలు, ప్రయత్నాలే చేస్తారని విమర్శించారు.
ఇంతకు ముందు రాజకీయ నాయకులు ఎవరూ హాజరు కానీ ఈ షోకు చంద్రబాబు ఎందుకు హాజరయ్యారని ప్రశ్నించారు?. బాలయ్యను సపోర్ట్ చేయడానికా? ఆ షో రేటింగ్ పెంచడానికి హాజరు అయ్యారా? లేక తన స్వార్థం కోసం చంద్రబాబు హాజరయ్యారా? అని నిలదీశారు. తన స్వార్థం లేనిదే చంద్రబాబు నాయుడు ఏ పనీ చేయరనేది అందరికీ తెలుసన్నారు. పతనం అవుతున్న తన రాజకీయ జీవితానికి ఏకాస్త అయినా ఉపయోగపడుతుందనే ఆశతో హాజరై పప్పులో కాలువేసి ఆ రెండు కుటుంబాలు మరింత దిగజారిపోయాయని ఆరోపించారు.
పోగాలం దాపురించే అమరావతి నుంచి అరసవెల్లికి మహా పాదయాత్ర అంటూ రైతుల ముసుగులో టీడీపీ నిర్ణయం తీసుకుందన్నారు అంబటి. ఇప్పుడు ఏం జరుగుతోంది? మహా పాదయాత్ర పేరుతో వెళుతున్న ఫాల్స్ పాదయాత్రను చూసి ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యమవుతున్నారన్నారు. వారు పిడికిలి బిగించి ఉద్యమం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల చంద్రబాబుకు వ్యతిరేకంగా మూడు ప్రాంతాల్లో ప్రజలు చైతన్యవంతులయ్యారని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా రోజురోజుకీ దిగజారిపోతున్నచంద్రబాబు, మరింత పతనం అవడానికి తీసుకున్న నిర్ణయమే ఇదన్నారు.
షో హిట్.. "నారా-నందమూరి" పరువు ఫట్
ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం కోసమే తీసుకున్న నిర్ణయమంటూ చంద్రబాబు- బాలకృష్ణ చెబితే తానా తందానా అన్నట్టు ఉందన్నారు అంబటి. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని మూడు గంటలు సేపు బతిమిలాడినా వినలేదు అని, అందుకే జుట్టు పట్టుకుని కిందకు లాగేశానని చంద్రబాబు మాట్లాడితే అది ధర్మమే, న్యాయమే అని బాలకృష్ణ సపోర్టు చేస్తున్నారన్నారు. ఇదేమీ అన్యాయం...?. ఇది పోగాలం కాదా..? అని నిలదీశారు.