Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
AP Floods Donation | ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు కమెడియన్ హైపర్ ఆది తన వంతు విరాళం అందించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి చెక్కును అందజేశారు.
Hyper Aadi donation for flood victims in Andhra Pradesh : అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వరదలు వర్షాలతో దెబ్బతిన్న జిల్లాలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామికవేత్తల నుండి సెలబ్రిటీలు ఉద్యోగులు చివరకు విద్యార్థులు సైతం తమ స్థాయికి తగ్గట్టుగాఆర్థిక సాయం అందజేస్తున్నారు.దీనికి సంబంధించిన చెక్కులను స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిలకు వారు అందజేస్తున్నారు.
జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన హైపర్ ఆది మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ను కలిసి 3 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కును అందజేశారు. వీటిని వరదల కారణంగా నష్టపోయిన గ్రామ పంచాయతీలకు అందజేయాలని ఆది కోరారు. ఈ మూడు లక్షల్లో వరదల పీడిత గ్రామమైన ఎ.కె.మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) పంచాయతీకి రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. మరో రూ.2 లక్షలు తన స్వగ్రామం పల్లామల్లి గ్రామ పంచాయతీ (ప్రకాశం జిల్లా) కోసం ఇచ్చారు. ఆది మాట్లాడుతూ వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రూ.6 కోట్లు విరాళం ఇచ్చి పవన్ కల్యాణ్ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు. ఆ స్ఫూర్తి తో నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వవచ్చని తెలిసి తన వంతుగా రూ.3 లక్షలు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.
కొనసాగుతున్న విరాళాల వెల్లువ..
తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి విరాళాలు అందజేసిన వారిలో అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ రూ.67,29,398, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు (రూ.25 లక్షలు) ఉన్నారు.అదే విధంగా తమ రాజానగరం నియోజకవర్గం నుంచి అందిన రూ.4.82 లక్షల విరాళం కూడా సహాయ నిధికోసం అందజేశారు.
స్ఫూర్తి నింపుతున్న పవన్ కళ్యాణ్ భారీ విరాళం
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ చెరో కోటి చొప్పున ప్రకటించారు. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఆ మొత్తాన్ని ఖర్చు చేయాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఆ రెండు కోట్లు కాకుండా ఏపీలోని 400 గ్రామపంచాయతీల కోసం ఒక్కో లక్ష ప్రకటించారు. అంటే మొత్తంగా 6 కోట్ల రూపాయల తన సొంత నిధులను విరాళంగా ఇచ్చేశారు. ఇది మిగిలిన సెలబ్రిటీల్లో స్ఫూర్తిని నింపడంతో వారు కూడా ముంపు ప్రాంతాల పునర్నిర్మాణం కోసం సహాయక కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.