Amaravati News: అమరావతిలో 15 బ్యాంకులు, బీమా ప్రధాన కార్యాలయాలకు నిర్మలా సీతారామన్ శంకుస్థాపన
FM Sitharaman | అమరావతిలో బ్యాంకులు, బీమా ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పాల్గొన్నారు.

AP CM Chandrababu | అమరావతి: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశంలోని ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు తమ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. అమరావతిలో 25 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. శుక్రవారం ఉదయం 11.22 గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పి. నారాయణ హాజరయ్యారు.
అమరావతి సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సీఆర్డీఏ కార్యాలయం వద్ద మొదటి బ్లాకులో ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఏపీలో నేడు నిర్మలా సీతారామన్ శంకుస్థాపన బ్యాంకులలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఏపీ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి రాజధాని ప్రాంత రైతులు, వ్యవసాయ కూలీలు, స్థానికులు హాజరయ్యారు.
అమరావతి లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ స్వాగతం… pic.twitter.com/rMgbJZekNb
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 28, 2025
అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయి.. నారా లోకేష్
అమరావతి రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయని, మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారని ఆయన ఆరోపించారు. ఒకే వ్యక్తి కోసం రూ.450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు. అయితే, 'ఒకే రాష్ట్రం ఒకే రాజధాని' అనే నినాదంతో రైతులు పోరాడారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 'జై అమరావతి' నినాదంతో ముందుకు వెళ్లామని తెలిపారు. అమరావతిని ఆపడానికి అది ఎవరి ఇంట్లోనో లైట్ స్విచ్ కాదనీ, ఇది పవర్ ఫుల్ ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అని లోకేష్ పేర్కొన్నారు.
కూటమి హయాంలో జెట్ స్పీడ్ లో నిర్మాణాలు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పనులు పునఃప్రారంభించి జెట్ స్పీడ్ లో నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెప్పారు. మంగళగిరి చేనేత వస్త్రాలను ధరించి వాటిని ప్రమోట్ చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ఏ సాయం కోరినా ఆర్థిక మంత్రి సహకారం అందిస్తున్నారని, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వటంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా ఆదుకున్నారని అన్నారు. భారత్‌లో అతిపెద్ద డేటా సెంటర్ అయిన గూగుల్ విశాఖకు రావడానికి కూడా ఆమె అండగా నిలిచారని లోకేష్ తెలిపారు. ప్రస్తుతం 15 బ్యాంకులు, బీమా కంపెనీలు రూ.1334 కోట్లతో తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని, రాజధానిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని బ్యాంక్ స్ట్రీట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా లావాదేవీలకు ఈ కార్యాలయాలు పనిచేస్తాయని ఆయన వెల్లడించారు.






















