(Source: ECI/ABP News/ABP Majha)
AP Capital Donations: అమరావతి కోసం రెండు బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన విజయవాడకు చెందిన వృద్ధురాలు
Andhra Pradesh News | ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు అన్న క్యాంటీన్ల నిర్వహణకుగానూ పలువురు విరాళాలు అందజేశారు. విజయవాడకు చెందిన జి.వీ.మాణిక్యమ్మ బంగారు గాజులను విరాళంగా అందించారు.
Donations For AP Capital Amaravati | అమరావతి: గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల నుండి విముక్తి కల్పించాలని, కబ్జా అయిన భూములు తిరిగి తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP Cm Chandrababu Naidu)ని పలువురు బాధితులు కోరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం (ఆగస్టు 3న) ప్రజలు, కార్యకర్తల నుండి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి బాధితులు, ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు తరలివచ్చారు. పార్టీ ఆఫీసుకు సీఎం చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో సుమారు 5 వేల మందికిపైగా అక్కడికి చేరుకున్నారు. కొన్ని గంటలపాటు ప్రజల సమస్యలు విన్న, పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు.
వైసీపీ శ్రేణులు కబ్జాలు చేశాయని సీఎంకు ఫిర్యాదుల వెల్లువ
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని బొంతు, మహాసింగి గ్రామస్తులు వ్యవసాయ భూమి కబ్జాపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తమకు చెందిన 47 ఎకరాలను బొంతు గ్రామ వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, తమ భూముల్ని తిరిగి తమకు అప్పగించాలని కోరారు. తమ భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. వైసీపీ నేత కిరణ్ అడిగిన ధరకు తమ భూమి విక్రయించలేదని, కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి వేధించారని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం నగిరిపాడుకు చెందిన మాచినేని మోహన్ రావు సీఎం చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. తన భార్యను కూడా గతంలో పోలీసుల అండతో వైసీపీ నేతలు భయపెట్టారని అన్నారు.
రాజధాని, అన్నా క్యాంటీన్లకు విరాళాలు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజధాని అమరావతి నిర్మాణానికి, అన్నా క్యాంటీన్ల నిర్వహణకు పలువురు విరాళాలు అందిస్తున్నారు. పార్టీ సెంట్రల్ ఆఫీసులు సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి పలువురు దాతలు చెక్కులు అందించారు. విజయవాడకు చెందిన జి.వీ.మాణిక్యమ్మ అనే వృద్ధురాలు అమరావతి నిర్మాణం కోసం తన చేతికున్న బంగారు గాజులను విరాళంగా అందించారు. కంకిపాడుకు చెందిన రైతు ఎన్.ప్రభాకర్ రావు రూ.10 లక్షలు ఇచ్చారు. భగవద్గీత గ్రూపు తరుపున నిర్మల అనే వృద్ధురాలు సైతం రూ.3.42 లక్షలు విరాళంగా ఇచ్చారు.
Also Read: విశాఖ రైల్వే జోన్ నిలిచిపోవడానికి కారణం చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
నేను సైతం అంటూ దివ్యాంగుడు
చంద్రగిరి నియోజకవర్గం, పెరుమాళ్లపల్లికి చెందిన జీవన్ కుమార్ అనే దివ్యాంగుడు సైతం తన వంతు విరాళం అందించాడు. జీవన్ కుమార్ రూ.25 వేలు ఏపీ ప్రభుత్వానికి అందజేశారు. చిత్తూరుకు చెందిన వల్లేరు వెంకటేశ్ నాయుడు రూ.1 లక్ష రూపాయలను రాజధాని అమరావతికి విరాళంగా అందించారు. విజయవాడ అయ్యప్పనగర్ కు చెందిన పర్చూరి రాజబాబయ్య, కమల కుమారి అన్న క్యాంటీన్ నిర్వహణకుగానూ రూ.2 లక్షలు విరాళంగా అందించారు. రాష్ట్రం అభివృద్ధి కోసం, రాజధాని నిర్మాణం కోసం విరాళాలు అందించిన వారిని సీఎం చంద్రబాబు అభినందించారు.
Also Read: Atchannaidu: కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, త్వరలో కొత్త చట్టం: మంత్రి అచ్చెన్నాయుడు