జగన్‌కు పవన్‌పై ఉన్న ఇంట్రెస్ట్ జనాలపై ఉంటే బాగున్ను: రామకృష్ణ
గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తుంటే.. వాటిని అడ్డుకునేందుకు సీఎం జగన్ తెగ ఆసక్తి చూపించారని గుర్తు చేశారు. ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద ఉంటుంటే చాలా బాగుండేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సీఎం పదవీ కాలం పూర్తయ్యేనాటికి రాష్ట్ర అప్పులు పది లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇస్తున్న ఉచితాలపై పెద్ద చర్చ జరుగుతోందని అన్నారు. ఆశ్వనీ కుమార్ వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు స్పందించిందని, పెద్ద వ్యాపార సంస్ధలకు పది లక్షల కోట్లు మాఫీ చేశారని.. ఇది అశ్వనీ కుమార్ కు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. వ్యవసాయానికి గిట్టుబాటు ధర రావడం లేదని, 1986 నుంచి ఇప్పటి వరకూ 6 లక్షల మంది రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులపై వివరంగా సీజేఐకి లేఖ రాయబోతున్నట్లు తెలిపారు. లక్షల మంది రైతులు ఎందుకు చనిపోయారో కమిటీ వేయండని కోరుతామని స్పష్టం చేశారు.
అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారు..
ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల పాలైందని, 2014 జూన్ 2 నాటికి జనాభా నిష్పత్తి ప్రకారం 96 వేల కోట్లు అప్పు ఉందని.. జగన్ దిగిపోయే నాటికి ఆ అప్పు పదిలక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులు లేకుండా చేశారని, విద్యావ్యవస్థను అస్ధవ్యస్ధం చేసి ప్రాథమిక విద్యలో మాతృభాష లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కావాలని ఆనాడు పదేపదే చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు ఆ మాట కూడా ఎత్తట్లేదని ఆగ్రంహ వ్యక్తం చేశారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేశారని రామకృష్ణ విమర్శించారు. గంగవరం పోర్టును అదానికి అప్పజెప్పావంటూ.. జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ విశాఖలో మహా సభలు జరుగుతున్నాయని ఈ అంశాలన్నింటినీ ఆ సభల్లో చర్చిస్తామని తెలిపారు.
పవన్ కల్యాణ్ యాత్రలపై ఉన్న ఇంట్రెస్ట్ ప్రజలపై లేదు..
గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తుంటే.. వాటిని అడ్డుకునేందుకు సీఎం జగన్ తెగ ఆసక్తి చూపించారని గుర్తు చేశారు. ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద ఉంటుంటే చాలా బాగుండేదన్నారు. మూడేళ్ల పాలనలో రైతులను పట్టించుకోకుండా ఉండి పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తుంటే జగన్‌కేంటీ నొప్పి అని ప్రశ్నించారు రామకృష్ణ. సీఎంగా ఉండి జగన్ చేయలేనిది ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పవన్ కల్యాణ్ చేసి చూపించారన్నారు.
వరదలు వచ్చినప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోలేరు..!
రెండు నెలల క్రిత భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర ప్రజలంతా అనేక రకాల సమస్యలు ఎదుర్కున్నారని రామకృష్ణ గుర్తు చేశారు. ఆ సమయలో కూడా సీఎం జగన్ సరిగ్గా స్పందించలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కడపలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించినప్పుడు.. ప్రజలందరూ సమస్యలు తీర్చాలంటూ కాళ్లావేలా పడ్డారని వివరించారు. అంతటి కష్ట కాలంలో కూడా సీఎం ప్రజలకు దగ్గరగా లేకపోవడం.. సాయం చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు.