CM Jagan: అంబేడ్కర్ స్ఫూర్తిగానే చారిత్రక అడుగులు వేశాం - సీఎం జగన్
అంబేడ్కర్ అడుగుజాడల్లో సామాజిక న్యాయం పాటించామని, చారిత్ర అడుగులు వేశామని సీఎం జగన్ అన్నారు.
CM Jagn on Ambedkar Birth Anniversary: దాదాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన ఘనతను ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. అంబేడ్కర్ అపార జ్ఞానశీలి అని కొనియాడారు. దేశానికి, రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచీ అని గుర్తు చేసుకున్నారు. వీటికి గట్టి పునాదులు వేశారని కొనియాడారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో సామాజిక న్యాయం పాటించామని, చారిత్ర అడుగులు వేశామని అన్నారు.
‘‘దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు’’ అని సీఎం జగన్ ట్వీట్లు చేశారు.
గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వమానవుడు అంబేద్కర్- KCR
CM KCR on Ambedkar Birth Anniversary: కష్టం తో కూడుకున్న ఎంతటి సుధీర్ఘమైన ప్రయాణమైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే గమ్యాన్ని చేరుకోవడం ఖాయమని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తాత్వికతకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితమే నిదర్శనమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గుర్తుచేసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ గమనాన్ని మార్చడంలో వారు పోషించిన పాత్రను, జాతికి అందించిన సేవలను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.. ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు డా. బిఆర్ అంబేద్కర్ (BR Ambedkar) అని సిఎం కొనియాడారు.
ఆత్మన్యూనతకు, దుర్భలత్వానికి గురయ్యే ఆలోచనల్లో కూరుకుపోకుండా, గొప్పగా ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వమానవుడు అంబేద్కర్ (BR Ambedkar) అని సిఎం అన్నారు. సమాజంలో నెలకొన్న అజ్జానాంధకారాలను చీల్చుకుంటూ జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన ప్రపంచ మేధావి డా. బిఆర్ అంబేద్కర్ అని సిఎం కేసీఆర్ అన్నారు. సమస్త శాస్త్రాలను ఔపోసన పట్టిన అంబేద్కర్ .. ప్రజాస్వామ్యం, వర్ణ నిర్మూలన, అంటరానితనం, మతమార్పిడులు, స్త్రీల హక్కులు, మతం, ఆర్థిక సంస్కరణలు, చరిత్ర, ఆర్థికవ్యవస్థ తో పాటు అనేక అంశాలపై ఆయన చేసిన రచనలు, ప్రసంగాలు, విమర్శలు యావత్ ప్రపంచాన్ని ఆలోచింపచేశాయని సీఎం అన్నారు. అసమానతలు లేని, ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు, సమస్త వ్యవస్థల్లో సమాన హక్కులకోసం తన జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేద్కర్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపమిచ్చి, నేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ తన మేధస్సుతో మదించి సమకూర్చినవేనని సీఎం పేర్కొన్నారు.