అన్నింటికీ స్పందించాల్సిన అవసరం లేదు- కన్నా కామెంట్స్‌పై సోమువీర్రాజు రియాక్షన్
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్‌లో జనసేన పార్టీ వ్యవహరంపై ఢిల్లీ పెద్దలకు తెలిపేందుకు వీర్రాజు హస్తిన వెళ్లినట్టు తెలుస్తోంది. చంద్రబాబు పవన్ భేటీపై కూడా మాట్లాడినట్టు సమాచారం
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుపై ఆ పార్టీ సీనియర్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యల దుమారు ఇంకా చల్లారలేదు. ఇది రాజకీయంగా పెద్ద దుమారాన్నే రాజేశాయి. పవన్‌ను రాష్ట్ర బీజేపీ సరిగ్గా వాడుకోలేదని, జనసేన నాయకులతో సమన్వయం లేదంటూ కన్నా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కన్నా చేసిన కామెంట్స్‌పై డిస్కషన్ రాలేదు కానీ... కన్నీ పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగింది.
పార్టీ మారబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారని... ముఖ్య అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారని కూడా ప్రచారం జరిగింది. కన్నా అభిమానులు చాలా మంది ఆయనకు ఫోన్ చేసి ఆరా తీశారట. అలాంటిది ఏమీ లేదని ఏదైనా సమాచారం ఉంటే తానే చెబుతానంటూ కన్నా చెప్పుకొచ్చారట. ఆయన అలా చెప్పినప్పటికీ ప్రచారానికి మాత్రం తెరపడినట్టు కనిపించడం లేదు. ఈ వ్యవహరంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు స్పందించడానికి నిరాకరించారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో సీనియర్ నాయకుడని అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లో సారాంశాన్ని తెలుసుకుంటామని ముగించారు.
ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వీర్రాజు
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్‌లో జనసేన పార్టీ వ్యవహరంపై ఢిల్లీ పెద్దలకు తెలిపేందుకు వీర్రాజు హస్తిన వెళ్లినట్టు తెలుస్తోంది. చంద్రబాబు పవన్ భేటీపై కూడా మాట్లాడినట్టు సమాచారం. ఈ ఢిల్లీ పర్యటన మాత్రం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అధ్యక్షుడు వీర్రాజు ఢిల్లీ వెళ్లినట్లుగా పార్టీలోని సీనియర్ నాయకులకు కూడా తెలియదని అంటున్నారు. ఆయన తిరుగు ప్రయాణంలో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన సమయంలో పార్టీ నాయకులు మాత్రం ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. దీంతో వీర్రాజు ఢిల్లీ పర్యటన వ్యవహరం పార్టీ నేతలు, కార్యకర్తలకు తెలిసింది.
వీర్రాజు ఢిల్లీ వెళ్లిన సమయంలోనే పవన్ కూడ హస్తినకు వెళుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. వీర్రాజు ఒక్కరే ఢిల్లీ వెళ్లి ఏపీలో తాజా పరిస్థితులను అగ్రనాయకత్వానికి వివరించారు. తిరుగు ప్రయాణం అనంతరం వీర్రాజు ఎయిర్ పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరిగిన పరిణామాలు అన్నీ పార్టీ పెద్దలకు వివరించామని వీర్రాజు తెలిపారు. చంద్రబాబు, పవన్ కలసినందు వల్ల మీడియా ఎక్కువ కంగారు పడుతుందని కామెంట్ చేశారు. చంద్రబాబు, పవన్ కలవడాన్ని తాను స్వాగతిస్తున్నానని వీర్రాజు తెలిపారు. పవన్ యాత్రను ప్రభుత్వం నిలిపింది, నిర్భంధించిందని,ఇటువంటి ఘటనలు సరి కాదని సంఘీభావంగా అందరూ కలిశారని స్పష్టం చేశారు. బీజేపీ, జనసేన కలిసే ముందుకు వెళ్తాయిని ఆయన తెలిపారు.
పవన్‌కు బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయిని వీర్రాజు తెలిపారు. రోడ్ మ్యాప్ పవన్ అడుగుతున్నారని అది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని వీర్రాజు వెల్లడించారు. తాజాగా కన్నా చేసిన వ్యాఖ్యలపై కూడా వీర్రాజు స్పందించారు. కన్నా పార్టీలో చాలా పెద్దలని, ఆయన వ్యాఖ్యలను ఉద్దేశించి తాను స్పందించని స్పష్టం చేశారు. ఆయనేదో అన్నారని... నేను అన్నింటికీ స్పందించనని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడతానని పేర్కొన్నారు. అమరావతి రైతుల యాత్రపై వైసీపీ ఎంపీ దాడి చేయించడాన్ని ఖండిస్తున్నామని, ఇటువంటి ఘటనలు ఎవరూ ప్రోత్సహించ కూడదన్నారు. దాడులను ప్రేరేపించింది వైసీపీ నాయకులేని ఆరోపించారు. బొత్స కూడా వాస్తవం తెలుసుకుని మాట్లాడాలని వీర్రాజు హితవు పలికారు. రైతు సంబంధిత కేంద్ర పథకాలను జగన్ సొంత పథకాలుగా ప్రచారం చేసుకున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు.