ఎస్పీఎఫ్‌లో మహిళలకు అవకాశం- పరిశీలనలో ఉందన్న హోం మంత్రి వనిత
రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టులు, ఆలయాల వద్ద ఎస్పీఎఫ్ పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఎస్పీఎఫ్‌లో మహిళలను రిక్రూట్ చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఎస్పీఎఫ్‌లో మహిళల నియామకాన్ని పరిశీలిస్తున్నామని హోం మంత్రి తానేటి వనితి తెలిపారు. ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పై సచివాలయంలో ఉన్నతాధికారులతో హోంమంత్రి తానేటి వనతి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలు, కోర్టులు, విమానాశ్రయాల్లో SPF పోలీసులు భద్రతా సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్పీఎఫ్ పోలీసులు తీసుకుంటున్న భద్రతా చర్యలను, సిబ్బందికి సంబంధించిన సమస్యలను, ప్రొమోషన్స్, ఇతర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీజీ సంతోష్ మెహ్రా వివరించారు.
భేటీలో మాట్లాడిన హోం మంత్రి... రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టులు, ఆలయాల వద్ద ఎస్పీఎఫ్ పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఎస్పీఎఫ్‌లో మహిళలను రిక్రూట్ చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జైళ్ల శాఖపై కూడా సమీక్ష నిర్వహించారు హోంమంత్రి వనిత. దేశంలో ఎక్కడా లేని విధంగా ఖైదీల కోసం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. జైళ్లలో తయారు ఉత్పత్తులపై జీఎస్టీ విధింపు అంశంపై కూడా చర్చిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలలో సత్ప్రవర్తన తీసుకొచ్చేలా శిక్షణా నైపుణ్యాలను ఇస్తున్నట్లు హోంమంత్రి వివరించారు.
ఢిల్లీలో జరిగిన చింతన్ శివిర్ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు హోం మినిస్టర్ తెలిపారు. దేశం మొత్తం పోలీసులందరికీ ఒకే యూనిఫాం ఉండాలనే ప్రతిపాదనపై కూడా చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
లోన్ యాప్‌లపై 1930కు కాల్ చేయండి
రాష్ట్రంలో లోన్‌యాప్ ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి తెలిపారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అపరిచిత సందేశాలను నమ్మి మోసపోవద్దని హోంమంత్రి హెచ్చరించారు. లోన్ యాప్ నిర్వాహకుల నుంచి బెదిరింపులు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. లోన్‌యాప్ మోసాలకు సంబంధించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని హోంమంత్రి తానేటి వనిత సూచించారు.
దిశ యాప్‌పై మరింత కసరత్తు
ఏపీ సీఎం జగన్ మానస పుత్రికగా చెప్పుకునే దిశ చట్టం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. ఏపీలోని ప్రతి మహిళకు దిశ యాప్ ఉపయోగపడేలా సన్నాహాలు చేశామని, ఇప్పటికే మంచి ఫలితాలు రావటంతో ఇతర రాష్ట్రాలు కూడా దిశ యాప్ వివరాలు తెలసుకుంటున్నారని పేర్కొన్నారు. దిశ చట్టానికి కూడా కేంద్రం నుంచి అనుమతులు తీసుకుంటున్నామని, దేశవ్యాప్తంగా ఈ విధానం అమలు చేసేందుకు అవసరం అయిన చర్యలు తీసుకునేందుకు కేంద్రంలోని అధికారులు కూడా పరిశీలన చేస్తున్నారని ఆమె అన్నారు.