Andhra Pradesh News: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ వాహనాలు.. ఏడాదికి లక్ష పంపిణీ!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించే పథకాన్ని పునరుత్పాదక ఇంధన వనరులశాఖ (నెడ్‌క్యాప్) ప్రారంభించింది. దీని కోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
Andhra Pradesh News: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించే పథకాన్ని పునరుత్పాదక ఇంధన వనరులశాఖ (నెడ్‌క్యాప్) ప్రారంభించింది. దీని కోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓలా, ఆథర్, బిగాస్, కైనెటిక్, టీవీఎస్, హీరో వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్కాబ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్‌సీ) ఆర్థిక సహకారం అందిస్తాయి.
ఏడాదిలో లక్ష వాహనాలు!
ఏడాదిలో కనీసం లక్ష వాహనాలను ఉద్యోగులకు అందించాలన్నదే లక్ష్యమని ఒక అధికారి తెలిపారు. విద్యుత్ వాహనాల కోసం 26 జిల్లాల్లో పని చేసే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా యాప్‌ను నెడ్‌క్యాప్ అందుబాటులోకి తెచ్చింది. వాహనాలకు రుణాలను అందించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేకశాఖను విజయవాడలో ఏర్పాటు చేస్తుంది.
రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా... తొలిదశలో లక్ష వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండానే నెలవారీ వాయిదాను సిబ్బంది జీతం నుంచే నేరుగా చెల్లించేలా వాహనాల తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
బ్యాటరీ సామర్థ్యం, వేగం ఆధారంగా వాహనాల ధర ఉంటుందని పేర్కొంది. ఒక్కో కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుంది. బండి వేగాన్ని బట్టి గరిష్టంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ సబ్సిడీ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెవీ ఇండిస్టీస్ రాయితీ సొమ్ము చెల్లిస్తుంది. ఈ వాహనాలు గంటకు 25 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నడవనున్నాయి. ఈ మేరకు నెడ్‌క్యాప్ ఎండి రమణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాల వల్ల రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. ఈ కాలుష్యాన్ని కొంతైనా తగ్గించాలనే ఉద్దేశ్యంతో నెడ్‌క్యాప్ విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది.