Viral News : పోలీసు అంకుల్ మా నాన్నను జైల్లో పెట్టండి- వైరల్‌గా మారిన బాలుడి ఫిర్యాదు
Viral News : బాపట్ల జిల్లా కర్లపాలెంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. తొమ్మిది సంవత్సరాలు బాలుడు డైరెక్టుగా పోలీస్టేషన్‌కు వచ్చి తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు.
తన తల్లి కష్టాన్ని చూడ లేక ఆ బాలుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తండ్రి రోజు తాగొచ్చి తన తల్లిని వేధిస్తున్నాడని చెప్పాడు. తండ్రి రోజు తల్లిని తంతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ ఏడుస్తూ ఉండటం తాను చూడలేక పోతున్నానని వాపోయారు నాన్నను అరెస్టు చేయమని ఎస్సైని వేడుకున్నాడు.
బాపట్ల జిల్లా కర్లపాలెంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. తొమ్మిది సంవత్సరాలు బాలుడు డైరెక్టుగా పోలీస్టేషన్‌కు వచ్చి తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు. అరెస్టు చేయాలని కూడా అభ్యర్థించాడు. కర్లపాలె ఇస్లాం పేటకు చెందిన సుభాని, శుభాంబీ దంపతులు. సుభానీ స్థానికంగా ఉన్న రైస్ మిల్‌లో పని చేస్తున్నాడు. పని లేక పోతే కుట్టుమిషన్ పని కూడా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిసైన సుభాని ఇంట్లో తరచూ గొడవ చేస్తుంటాడు.
కష్టపడి సంపాదించిన మొత్తాన్ని సాయత్రం తాగేసి ఇంటికి వస్తుంటాడు సుభాని. ఈ విషయంపైనే భార్యభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. తన మాటకే ఎదురు చెబుతావా అంటూ భార్యను నిత్యం వేధిస్తూనే ఉన్నాడు. ప్రతి రోజు తగాదా పెట్టుకొని భార్యను కొట్టడం హాబీగా మారిపోయింది. పరువు కోసం భర్త వేధింపులను భరిస్తూనే కుమిలిపోయిందా ఇల్లాలు. ఇంటి నుంచి బయటకు రానీయకుండా గుట్టుగా ఉండిపోయింది.
ఇంటిలో ప్రతి రోజూ జరిగే వివాదాలను చూసిన కుమారుడు బాధతో చలించిపోయాడు. ఇంట్లో ఉన్న తనకు బయట ప్రపంచానికి కనిపించకుండా తల్లి దాచుకున్న కన్నీళ్లను చూశాడు. తల్లి ఆవేదన గమనించాడు. ఆ పసి హృదయం బరువెక్కిపోయింది. అమ్మ కోసం ఏదైనా చేయాలని మథన పడ్డాడు.
అమ్మ కన్నీళ్లు తుడవాలని భావించిన ఆ పసి వాడు కర్లపాలెం పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ ఉన్న ఎస్సైని కలుసుకున్నాడు. చిన్న పిల్లాడు పోలీస్ స్టేష్‌కు రావడం విచిత్రంగా ఉందని అనుకున్న ఆ ఎస్సై బాలుడిని పిలిచి ఆరా తీశారు. తన ఇంట్లో జరుగుతున్న గొడవలు తల్లి పడుతున్న బాధలు ఎస్సైకి పూసగుచ్చినట్టు వివరించాడు.
తన తల్లిని రక్షించాలని తన తండ్రిని శిక్షించాలని ఎస్సైను వేడుకున్నాడా బాలుడు. నిత్యం తాగేసి వస్తూ తల్లిని చిత్రవధ చేస్తున్న తండ్రిని జైల్లో వేయాలని ఫిర్యాదు చేశాడు. తండ్రిని జైల్లో పెడితే మీకు ఫుడ్ ఎవరు పెడతారని ఎస్సై అడిగిన ప్రశ్నకు బాలుడు చెప్పిన సమాధానం పోలీసులను కదిలించింది. తనకు ఫుడ్ పెట్టడానికి అమ్మ ఉందని... ఆమె బాధ పడకుండా ఉంటే అదే చాలని సమాధానం ఇచ్చాడు.
ఆ ఒక్క మాటతో బాలుడిని పేరెంట్స్‌ను స్టేషన్‌కు పిలిచారు పోలీసులు. జరిగింది వాస్తవమా కాదా అని తెలుసుకున్నారు. తండ్రికి లైట్‌గా క్లాస్ తీసుకున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. మరో సారి తాగొచ్చి భార్య ను వేధించి దాడి చేస్తే ఊరుకొనేదే లేదని హెచ్చరించారు పోలీసులు. భార్య బిడ్డల భవిష్యత్ పట్టించుకోకుండా తాగి తందనాలు ఆడుతూ కనబడితే కేసు పెట్టి జైలులో పెడతామని వార్నింగ్ ఇచ్చారు. బైడోవర్ చేసి ఆ తాగుబోతు తండ్రిని పంపించారు. బాలుడు ధైర్యాన్ని పోలీసులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అమ్మ కష్టాన్ని చూసి చలించిపోయిన బాలుడికి హాట్సాప్ చెబుతున్నారు.