Amaravati Farmers : అమరావతి రైతుల మహా పాదయాత్ర ! అనుమతిపై టెన్షన్ పెడుతున్న పోలీసులు !
నవంబర్ ఒకటో తేదీ నుంచి అమరావతి రైతులు మహాపాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే హైకోర్టు చెప్పినా అనుమతిపై పోలీసులు నాన్చుతున్నారు.
![Amaravati Farmers : అమరావతి రైతుల మహా పాదయాత్ర ! అనుమతిపై టెన్షన్ పెడుతున్న పోలీసులు ! Amravati farmers have decided to undertake the Mahapadayatra from November 1.. Police Permission in Pending Amaravati Farmers : అమరావతి రైతుల మహా పాదయాత్ర ! అనుమతిపై టెన్షన్ పెడుతున్న పోలీసులు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/9d88dd5029b796121c2c4176f8e0524b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అని పేరు పెట్టుకుని హైకోర్టు వద్ద నుంచి తిరుమలకు పాదయాత్ర చేయాలని కార్యక్రమాన్ని ఖరారు చేసుకున్నారు. అమరావతి జేఏసీ నేతృత్వంలో సాగే ఈ పాదయాత్రకు విరాళాలతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించి డిసెంబర్ 17వ తేదీన ముగియనుంది. ఏపీ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ ఆ ప్రాంత రైతులు దాదాపుగా రెండేళ్లుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
Also Read : సీఎం జగన్ అక్రమాస్తుల పెండింగ్ కేసులపై రోజు వారీ విచారణ
తాము చేపట్టే మహా పాదయాత్రకు ప్రముఖుల మద్దతును అమరావతి రైతులు కోరుతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. నాలుగు రోజుల క్రితం అమరావతి రైతుల మహాపాదయాత్రకు పవన్ కళ్యాణ్ మద్దతును ప్రకటించారు. పవన్‌కు అమరావతి ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల మహాపాదయాత్ర విజయవంతం కావాలని నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా రైతుల పాదయాత్ర సక్సెస్ కావాలని కోరుకున్నారు. అమరావతి రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు.
అయితే రైతుల పాదయాత్రకు పోలీసుల అనుమతి ఇంత వరకూ రాలేదు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే డీజీపీకి వినతిపత్రం అందజేసినా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోలీసులు అడ్డుకునే అవకాశం ఉండటంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి రాజధానిగా ఉండడం వల్ల 13 జిల్లాలకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు పాదయాత్రలో రైతులు వివరిస్తారని.. పోలీసులు అనుమతిఇవ్వడం లేదని వాదించారు. వాదనలు విన్న హైకోర్టు గురువారం సాయంత్రంలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఇంకా పోలీసుల వైపు నుంచి నిర్ణయం రాలేదు.
పాదయాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు తమకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వం నుంచి తమకు ప్రాణహాని ఉందని, ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగేలా పోలీసులు చూడాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రానికి రాజధాని వస్తుందంటే అన్ని రూపాయి తీసుకోకుండా భూముల్ని త్యాగం చేసిన రైతుల్ని కొత్త ప్రభుత్వ నిర్ణయాలు నష్టపరిచాయి. ఈ సమస్య ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది. రైతులుతమ తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)