CM Jagan Review : విశాఖలో 1.43 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, చురుగ్గా పాలుపంచుకునే ప్రజాప్రతినిధులకు అవార్డులు : సీఎం జగన్
CM Jagan Review : ఈ ఏడాది గృహ నిర్మాణం కోసం రూ.13 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. విశాఖలో 1.43 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు.
CM Jagan Review : గృహనిర్మాణ శాఖపై అమరావతి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇళ్లపట్టాలు కోసం చేసిన ఖర్చు కాకుండా కేవలం నిర్మాణం కోసమే గడచిన ఆర్థిక సంవత్సంలో సుమారు రూ.3,600 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేసిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,105 కోట్లు గృహ నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, 3.46 లక్షల మెట్రిక్‌టన్నుల స్టీల్‌ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.
సమీక్షలో సీఎం ఏమన్నారంటే
కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కేసులు పరిష్కారం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నచోట ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలన్నారు. ఇందులో జాప్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడంతో విశాఖలో 1.43 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం అయినట్లు తెలిపారు. విశాఖలో పట్టాలు పంపిణీ పూర్తికాగానే వాటికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు జూన్ నాటికి ప్రారంభం అవుతాయని అధికారులు సీఎంకు తెలిపారు. దాదాపు 63 లే అవుట్లలో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. ఇక్కడ భూమిని చదును చేయడంతోపాటు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, లే అవుట్లలో నీళ్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 5 వేలకుపైగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నచోట నిర్మాణ సామగ్రిని ఉంచడానికి వీలుగా గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 66 గోడౌన్లలో 47 గోడౌన్ల నిర్మాణం ప్రారంభమయ్యిందన్నారు.
ప్రజాప్రతినిధులకు అవార్డులు
ఇళ్లకు ఇచ్చే కరెంటు సామాగ్రి అత్యంత నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు అన్నీ కూడా నాణ్యతతో ఉండాలన్నారు. నాణ్యతలేని పరికరాలు కొంటే తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు ఉన్నవాటినే కొనుగోలు చేయాలని అధికారులుకు సీఎం స్పష్టం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న ప్రజాప్రతినిధులను సత్కరించాలని సీఎం నిర్ణయించారు. వారు చురుగ్గా వ్యవహరిస్తున్నచోట నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇలాంటి స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించాలన్నారు. మండలానికి ఒక సర్పంచ్‌ని, మున్సిపాలిటికి ఒక కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి తాగునీరు, డ్రైనేజీ, కరెంటు లాంటి కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం ఆదేశించారు.
టిడ్కో ఇళ్లపై ప్రత్యేక దృష్టి
ఇప్పటివరకూ ఈ పథకాన్ని వినియోగించుకున్న 10.2 లక్షలమంది, 6.15 లక్షల మందికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మిగిలిన వారికి వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. టిడ్కో ఇళ్లు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం మార్గదర్శకాలు తయారుచేయాలన్నారు.
ఎంఐజీ ప్లాట్ల పథకంపై
పట్టణాలు, నగరాలు ఉన్న 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎంఐజీ ఇళ్ల పథకం కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. ఇప్పటికే 41 నియోజక వర్గాల్లో 4127.5 ఎకరాల భూములను గుర్తించామని అధికారులు తెలిపారు. వివాదాలు, చిక్కులు లేనివిధంగా క్లియర్ టైటిల్‌తో సరసమైన ధరలకు ఈ ప్లాట్లు ఇస్తామని సీఎం తెలిపారు. మౌలిక సదుపాయాల కోసం లేఅవుట్‌లో అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇతర లే అవుట్లకు మార్గదర్శకంగా ప్రభుత్వ ఎంఐజీ లేవుట్ ఉండాలన్నారు.