CM Jagan Review : మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, సీఎం జగన్ ఆదేశాలు
మార్చి1నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలని జగన్ స్పష్టం చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలతో పాటు క్యాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించిన జగన్ అందుకు అవసరం అయిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి విలేజ్ క్లినిక్‌కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ వెళ్తారని సీఎంకు అధికారులు వివరించారు. జనాభా 4వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు చేయాలని జగన్ సూచించారు. మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.
ప్రజా ప్రతినిధులు ఆసుపత్రుల బాట
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను అమలులోకి తీసుకువచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన కూడా చేయాలని సీఎం జగన్ అన్నారు. దీనివల్ల ఆస్పత్రుల పని తీరు మెరుగు అవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అందరూ కలసి కట్టుగా పనిచేయాలని సూచించారు.
గోరు ముద్దలో రాగి మాల్ట్...
మార్చి 1 నుంచి గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్ అందించే విషయంపై సీఎం జగన్ సమీక్షించారు. ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్ ను కూడా అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. డబ్ల్యూహెచ్‌ఓ లేదా జీఎంపీ ఆధీకృత మందులు మాత్రమే ఇవ్వాలని ఇది వరకే ఆదేశాలు ఇచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు జగన్ సూచించారు. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడదని స్పష్టం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి మన రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
శాఖల మధ్య సమన్వయం
వైద్యారోగ్యశాఖ – స్త్రీ శిశుసంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని, డేటా అనుసంధానత ఉండాలని సీఎం జగన్ అన్నారు. స్కూల్స్, హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. విలేజ్ క్లినిక్స్ ఎస్‌ఓపీలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం తదితర అంశాలను సీఎం ఆదేశాల మేరకు చేర్చామన్న అధికారులు, విలేజ్ క్లినిక్స్ సిబ్బంది నుంచి సంబంధిత సమస్యలను నివేధించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలని సీఎం అన్నారు. మండల స్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్ వీటిపై పర్యవేక్షణ చేయాన్నారు. పరిసరాల పరిశుభ్రత, సమతుల్య ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని అధికారులకు తెలిపారు. 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని,ప్రతిరోజూ దీని పై సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లోని కలెక్టర్లు కూడా దీనిపై పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలన్న సీఎం, సిబ్బంది ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించాలని చెప్పారు.