AP High Court On Advisers : ప్రభుత్వ సలహాదారుల రాజ్యాంగ బద్ధతపై తేలుస్తాం, హైకోర్టు కీలక వ్యాఖ్యలు
AP High Court On Advisers : ప్రభుత్వ సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. సలహాదారులకు సంబంధించి రాజ్యాంగ బద్ధతపై తేలుస్తామని స్పష్టం చేసింది.
AP High Court On Advisers : ఏపీలో ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సలహాదారుల నియామకంపై రాజ్యాంగ బద్ధతపై తేలుస్తామని కోర్టు తెలిపింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి నియామకాలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగిన కోర్టు... సలహాదారులను నియమించుకుంటూ పోతే వారి సంఖ్యకు పరిమితి ఏం ఉండదని అభిప్రాయపడింది. సలహాదారులకు జవాబుదారీతనం, బాధ్యత ఏం ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. వారికి నియమ నిబంధనలు, ఎలాంటి ప్రవర్తనా నియమావళి లేదని తెలిపింది. సలహాదారుల ద్వారా ప్రభుత్వానికి చెందిన సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. గత విచారణల్లో కీలక వ్యాఖ్యల చేసిన కోర్టు తాజాగా రాజ్యాంగ బద్ధతపై తెలుస్తామని స్పష్టం చేసింది.
రాజ్యాంగ విరుద్ధంగా నియమించడంలేదు
రోడ్డుపై వెళ్లే వ్యక్తిని రాత్రికిరాత్రే సలహాదారుగా నియమించడానికి వీల్లేదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. అలా అని సలహాదారుల నియామకంపై మార్గదర్శకాలు జారీ చేయబోమని కోర్టు స్పష్టం చేసింది. సలహాదారులకు సంబంధించి రాజ్యాంగబద్ధతను మాత్రమే తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది. ఎప్పటి నుంచో ప్రభుత్వ సలహాదారుల నియామకాలు జరుగుతున్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సలహాదారులపై గతంలో ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా సలహాదారులను నియమించట్లేదని, కేబినెట్ హోదా కూడా ఇవ్వట్లేదని చెప్పారు. చాలామంది సలహాదారుల కాలపరిమితి కూడా ముగిసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బయట నుంచి వచ్చిన వారిలో జవాబుదారీతనం ఎలా ఉంటుందని కోర్టు ప్రశ్నించింది.
గత విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ... ఆయా శాఖలపై నిష్ణాతులైన వారినే సలహాదారులుగా నియమిస్తున్నామని వాదనలు వినిపించారు. ఏదైనా అంశంలో తుది నిర్ణయానికి ముందు ప్రభుత్వం సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందన్నారు. అయితే ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. గత విచారణలో సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సలహాదారుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గత విచారణలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం, మంత్రులకు, ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడాన్ని ఒకేలా చూడలేమని చెప్పింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కలెక్టర్, పోలీసు కమిషనర్, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమించుకునే ప్రమాదం ఉందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. సలహాదారుల నియామకానికి అసలు అంతు అనేది ఉందా అని ప్రశ్నించింది. ఈ నియామకాలు రాజ్యాంగ బద్ధమో కాదో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలేంటో తేలుస్తామంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత మంది సలహాదారులు ఉన్నారో, ప్రభుత్వ శాఖల వారీగా ఎంత మందిని నియమించారు, ఈ విషయంలో విధివిధానాలు ఏంటో పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్. శ్రీరామ్ ఇప్పటికే ఆదేశించింది.